నవతెలంగాణ- హైదరాబాద్ : కెనడాలోని వాగన్‌లో ఉన్న వండర్‌లాండ్ అమ్యూజిమెంట్ పార్కు సందర్శకులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారు ఎక్కిన లంబర్‌జాక్ రైడ్ మాల్‌ఫంక్షన్ కారణంగా నిట్టనిలువుగా గాల్లో ఆగిపోయింది. దీంతో వారంతా తలకిందులుగా అరగంటపాటు అలాగే వేడుతూ ఆర్తనాదాలు చేశారు. తమ కిందికి దించాలని అరుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పార్కులో ఒక్కసారిగా వాతావరణం ఉద్విగ్నంగా మారిపోయింది. శనివారం రాత్రి 10.40 గంటలకు జరిగిందీ ఘటన. వెంటనే అప్రమత్తమైన పార్క్ సిబ్బంది అరగంటపాటు ప్రయత్నించి వారిని సురక్షితంగా కిందికి దించారు. ఈ ఘటన తర్వాత చాతీలో నొప్పిగా ఉందంటూ పలువురు సందర్శకులు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని పార్క్‌లోని హెల్త్ సెంటర్‌కు తరలించారు. అయితే, ఎలాంటి ప్రమాదం లేదని, చికిత్స అసవరం లేదని చెప్పి పంపించివేశారు. విజిటర్ల భద్రతే తమకు ప్రధానమని పార్క్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. రైడ్ మాల్‌ఫంక్షన్ నేపథ్యంలో ఆదివారం పార్కును మూసివేశారు. తొలుత థ్రిల్ కోసం అలా మధ్యలో ఆపేసి ఉంటారని భావించామని, కానీ అంబులెన్సులు రావడంతో ఏదో జరిగినట్టు అర్థమై భయం వేసిందని సందర్శకులు చెప్పారు. కొందరైతే వాంతులు కూడా చేసుకున్నారని తెలిపారు. తమను కిందికి దించిన తర్వాత కూడా మామూలు మనుషులం కాలేకపోయామని పేర్కొన్నారు