ఫ్రెంచ్‌ ట్రోఫీకి మూడో ముద్దు

–  ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
– ఫైనల్లో ముచోవపై మెరుపు విజయం
– చాంపియన్‌ ఇగా స్వైటెక్‌
– పారిస్‌లో పొలాండ్‌ స్టార్‌కు మూడో టైటిల్‌
పొలాండ్‌ స్టార్‌ ఇగా స్వైటెక్‌ ఇరగదీసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌కు ముచ్చటగా మూడో ముద్దు పెట్టింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కరొలినా ముచోవ (చెక్‌ రిపబ్లిక్‌)పై థ్రిల్లింగ్‌ విజయం సాధించిన ఇగా స్వైటెక్‌ కెరీర్‌ నాల్గో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. సుమారు మూడు గంటల పాటు మూడు సెట్లలో తలపడిన స్వైటెక్‌, ముచోవ అభిమానులకు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చారు. కెరీర్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో చెక్‌ భామ ముచోవ పోరాడినా నిరాశ తప్పలేదు.
వరల్డ్‌ నం.1 పొలాండ్‌ భామ ఇగా స్వైటెక్‌ మరో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. పారిస్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో కరొలినా ముచోవ (చెక్‌ రిపబ్లిక్‌)పై ఇగా స్వైటెక్‌ 6-2, 5-7, 6-4తో మెరుపు విజయం సాధించింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను ముచ్చటగా మూడోసారి ఖాతాలో వేసుకుంది. 166 నిమిషాల పాటు మహా ఫైనల్లో పొలాండ్‌ స్టార్‌ పైచేయి సాధించింది. 22 ఏండ్ల ఇగా స్వైటెక్‌ 2020, 2022లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గగా.. తాజాగా 2023 మహిళల సింగిల్స్‌ చాంపి యన్‌గా మరోసారి నిలిచింది. ఇగా స్వైటెక్‌ 2022 యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను సైతం గెల్చుకున్న సంగతి తెలిసిందే.
ఉత్కంఠ రేపినా.. స్వైటెక్‌ జోరు
మహిళల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఇగా స్వైటెక్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అంచనాలకు తగినట్టుగా తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో పోటీపడుతున్న కరొలినా ముచోవపై స్వైటెక్‌ ఆధిపత్యం చూపించింది. తొలి సెట్‌ ఆరంభంలోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించిన స్వైటెక్‌ 3-0తో తిరుగులేని పట్టు సాధించింది. స్వైటెక్‌ దూకుడుతో తొలి సెట్‌లో ముచోవ పుంజుకునే అవకాశమే లేకపోయింది. రెండో సెట్‌లోనూ స్వైటెక్‌ అదే ప్రదర్శన పునరావృతం చేసింది. కరొలినా ముచోవ సర్వ్‌ను బ్రేక్‌ చేసి.. తన సర్వ్‌లను వరుసగా నిలుపుకుని 3-0తో ముందంజ వేసింది. కానీ ఈసారి ముచోవ వెనక్కి తగ్గలేదు. స్వైటెక్‌ సర్వ్‌ బ్రేక్‌ చేసి.. తన సర్వ్‌ను రెండుసార్లు నిలుపుకున్న ముచోవ 3-3తో స్కోరు సమం చేసింది. అక్కడితో ఆగని ముచోవ మరో బ్రేక్‌ పాయింట్‌తో 5-4తో ముందంజ వేసింది. 5-5తో స్కోర్లు సమం కాగా ముచోవ మళ్లీ సత్తా చాటింది. స్వైటెక్‌ సర్వ్‌ను మరోసారి బ్రేక్‌ చేసి పొలాండ్‌ స్టార్‌కు షాకిచ్చింది. 6-5తో సెట్‌ పాయింట్‌ ముందు నిలిచిన ముచోవ.. 7-5తో రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. దీంతో తుది పోరు నిర్ణయాత్మక మూడో సెట్‌కు దారితీసింది. ఇక మూడో సెట్లో ముచోవ ముందంజ వేసింది. ఆరంభంలోనే బ్రేక్‌ పాయింట్‌ సాధించి 2-0తో ఆధిక్యం సాధించింది. వేగంగా పుంజుకున్న ఇగా స్వైటెక్‌ వరుస గేములను గెల్చుకుని 2-2తో స్కోరు సమం చేసింది. 3-4తో వెనుకంజలో నిలిచిన వేళ రెండు బ్రేక్‌ పాయింట్లు సాధించిన స్వైటెక్‌ లాంఛనం ముగించింది. 6-4తో నిర్ణయాత్మక సెట్‌ను సొంతం చేసుకుని ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించింది.
టైటిల్‌ పోరులో కరొలినా ముచోవ ఓడినా ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఆరు ఏస్‌లు సంధించిన ముచోవ.. 30 విన్నర్లు సైతం కొట్టింది. స్వైటెక్‌ ఒక్క ఏస్‌, 19 విన్నర్లు మాత్రమే సాధించింది. స్వైటెక్‌ 27 అనవసర తప్పిదాలు చేయగా.. ముచోవ 30 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించింది. స్వైటెక్‌ ఏడు బ్రేక్‌ పాయింట్లు గెల్చుకోగా.. ముచోవ ఐదు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. పాయింట్ల పరంగా స్వైటెక్‌96-81తో ముచోవపై పైచేయి సాధించింది.

Spread the love