నవతెలంగాణ – అమరావతి: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన మరువకుముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద పద్మనాభ నిలయం వసతి సముదాయం రెండవ అంతస్థు నుంచి కిందపడి మూడు ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు ఆడుకుంటూ రెండవ అంతస్తు నుంచి సాత్విక్ అనే బాలుడు కింద పడ్డాడు. తీవ్ర గాయాలకు గురైన సాత్విక్ ను అశ్విని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పోందుతు మృతి చెందాడు. కడప పట్టణం చిన్న చౌక్ కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి ఈ నెల 13న తిరుపతికి వచ్చి టోకెన్లు పొందారు. జనవరి 16వ తేదీ శ్రీవారి దర్శనం టోకెన్ కేటాయించారు. దీంతో ఆ కుటుంబం మొత్తం బుధవారం తిరుమల కొండపైకి చేరుకుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పద్మనాభ నిలయంలో లాకర్ పొందారు. అయితే వసతి సముదాయం వద్ద వారి ఇద్ధరు కుమారులు ఆడుకుంటుండగా గ్రిల్స్ మధ్యలో నుంచి అనుకోకుండా జరిగిన ప్రమాదంలో కుమారుడు కింద పడి చనిపోయాడు. దైవ దర్శనానికి వచ్చిన తమ రెండవ కుమారుడైన సాత్విక్ మరణంతో తీవ్ర విషాదంలో మునిగారు. బాలుడి మృతిపై పోలీసులు కేసు న మోదు చేసి దర్యాప్తు చేపట్టారు.