– సీసీ కెమెరాలో రికార్డు అయిన నిందితుల దృశ్యాలు
– ఇద్దరు అనుమానితులను గుర్తించిన పోలీసులు
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి మూడేళ్ల బాలుడు అపహరణకు గురైన ఘటన శనివారం తెల్లవారుజామున కలకలం రేపుతోంది. ఈ విషయమై బాధిత కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ విజయ్ బాబు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మానిక్ భండార్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య డెలివరీ కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చారు. రాత్రి సమయంలో తన మూడేళ్ల బాలుడితో కలిసి ఆస్పత్రి కారిడార్ లో నిద్రించాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని ఎత్తుకెళ్లారు. కాసేపటికి తన కుమారుడు అదృశ్యమైన విషయాన్ని గుర్తించిన తండ్రి ఆస్పత్రిలో ఉన్న పోలీసు సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపారు. ఒకటో టౌన్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు కలిసి బాలుడిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.