వేళాపాళా లేని సినిమా

A timeless movie– హైకోర్టు ఆగ్రహం
– గేమ్‌ఛేంజర్‌ టిక్కెట్‌ ధరల పెంపుపై సమీక్షించాలి : ప్రభుత్వానికి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రామ్‌చరణ్‌ హీరోగా నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా టిక్కెట్‌ ధరలను పెంచుతూ హౌంశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను 24 గంటల్లోగా తిరిగి సమీక్ష చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అదనపు షోలకు అనుమతించే విషయంలో కూడా ప్రభుత్వం చట్ట నిబంధనలను అమలు చేయాలని తెలిపింది. పబ్లిక్‌ హెల్త్‌, సెక్యూరిటీ వంటి విషయాలపై అన్ని ఏర్పాట్లు చేసే వరకు తెల్లవారు జాము షోలకు అనుమతి ఇవ్వరాదని కోరింది. సమగ్ర వివరాలతో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.సినిమాల ప్రదర్శనలకు కూడా వేళాపాళా ఉంటుందనీ, ఎప్పుడుపడితే అప్పుడు సినిమాలను ప్రదర్శించ కూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెల్లవారు జాము 4 గంటలకే హీరో రామ్‌చరణ్‌ యాక్టింగ్‌ చేసిన గేమ్‌ ఛేంజర్‌ సినిమాను ప్రదర్శించేందుకు రాష్ట్రసర్కార్‌ అనుమతి ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా సినిమా షోలకు అనుమతివ్వడం మానవ హక్కుల ఉల్లంఘన లాంటిదేనని చెప్పింది. రాత్రి పూట నిద్రపోవాలనీ, ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కు కిందకే వస్తుందని చెప్పింది. అర్ధరాత్రి లేచి సినిమా చూసేందుకు సగటు ప్రేక్షకుడు వెళితే వాడి ఆరోగ్యం ఏం కావాలని వ్యాఖ్యానించింది. పగలు నిద్రపోయినప్పటికీ రాత్రి నిద్రపోతేనే మనిషికి ఆరోగ్యమని చెప్పింది. ఇదే సమయంలో తెల్లవారుజామున, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా సినిమా షోలకు మైనర్లకు ముఖ్యంగా 16 ఏండ్లలోపు వాళ్లకు అనుమతి ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించింది. ఒక షో తర్వాత మరో షోకి మధ్య పావుగంట మాత్రమే సమయం ఉంటే థియేటర్‌లోకి వెళ్లే వారికి, వచ్చే వారికి సమయం ఎలా సరిపోతుందని ప్రశ్నించింది. షోల మధ్య 15 నిమిషాల వ్యవధి ఉంటే ఎలా సరిపోతుందో అర్ధం కావడం లేదంది. స్టేట్‌ గవర్నమెంట్‌ బెనిఫిట్‌ షోలకు అనుమతి ఇవ్వబోమని చెప్పాక పుష్ప-2 తరువాత గేమ్‌ చేంజర్‌ సినిమా ఏంటని ఆరా తీసింది. అదనపు షో పేరుతో తెల్లవారుజామున షోకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది. దిల్‌ రాజు నిర్మాతగా శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన గేమ్‌ఛేంజర్‌ సినిమా తెల్లవారుజాము 4.30 గంటలకు ప్రదర్శనకు అనుమతి, సినిమా టిక్కెట్ల రేట్ల పెంపునకు అనుమతిస్తూ హౌం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఇచ్చిన మెమోలను తిరిగి సమీక్ష చేయాలని తెలిపింది. ప్రధానంగా టిక్కెట్ల రేట్ల పెంపుపై 24 గంటల్లోగా ప్రభుత్వం తిరిగి సమీక్ష చేయాలంది. రాష్ట్రంలో సినిమా బెన్‌ఫిట్‌ షోకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం చెప్పిన కొద్ది రోజులకే గేమ్‌ ఛేంజర్‌ సినిమాకు ఎలా ఇచ్చిందని ప్రశ్నించింది. తెల్లవారు జామున 4 గంటలకు స్పెషల్‌ షో పేరుతో అనుమతి ఇవ్వడాన్ని తప్పుపట్టింది. అయితే, ఇప్పటికే సినిమా రిలీజ్‌ అయినందున ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పింది. సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై మెమో విషయంలో 24 గంటల్లోగా ప్రభుత్వం తిరిగి సమీక్ష చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్‌ వేయాలని ఆదేశించింది. విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
హరీశ్‌ను 28 వరకు అరెస్టు చేయొద్దు
ఫోన్‌ ట్యాపింగ్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా ఉన్న సిద్దిపేట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును అరెస్టు చేయరాదన్న గత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. రాజకీయ కక్షతో చక్రధర్‌గౌడ్‌ ఫిర్యాదు చేస్తే దానిని పోలీసులు నమోదు చేశారనీ, తనపై నమోదైన ఫోన్‌ ట్యాపింగ్‌’ కేసును కొట్టివేయాలని హరీశ్‌ వేసిన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు జడ్జి లక్ష్మణ్‌ విచారించారు. పోలీసుల కౌంటర్‌కు రిప్ల్కె ఇచ్చేందుకు గడువు కావాలని హరీశ్‌ లాయర్‌ కోరడంతో విచారణ 28కి వాయిదా పడింది.
బార్‌ కౌన్సిల్‌ ఎన్నికల కోసం రిట్‌
రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ పాలకవర్గానికి ఐదేండ్ల గడువు ముగిసి 6 నెలలు దాటినా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్‌ బి.విజరుసేన్‌రెడ్డి విచారించారు, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు నోటీసులు ఇచ్చారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహిస్తారో వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.

Spread the love