జానెడు జాగా కోసం..అలుపెరుగని సమరం..!

ప్రభుత్వ భూమిలో స్థలాల కోసం చెన్నూర్‌లో పేదల పోరాటం
– పంపిణీపై నోరు మెదపని ప్రభుత్వం.. అధికారులు
– ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కబ్జాదారుల పన్నాగం

– నిరుపేదలకు అండగా నిలిచిన సీపీఐ(ఎం)
నవతెలంగాణ- జైపూర్‌
వారంతా నిరుపేదలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. రోజువారీ కూలీనాలి చేసుకొని జీవనం సాగించే ఈ బీదల నివాసానికి సొంత జాగా లేదు. కుటుంబాలతో అద్దె ఇండ్లు.. గుడిసెల్లో బతుకీడుస్తున్నారు. ఏండ్ల తరబడి ఇక్కడే ఉంటున్నా కనీసం జానెడు జాగాకు నోచుకోలేని దీనస్థితిలో ఉన్న వీరు ఇంటి స్థలం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. మండుతున్న ఎండను లెక్కచేయకుండా ఎడారిలాంటి పడావు భూమిలో గుడారాలు వేసుకొని అక్కడే ఉంటున్నారు. ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు. మరోపక్క నిరుపేదలకు చెందాల్సిన ఈ అసైన్డ్‌ భూమిని కాజేసేందుకు కబ్జాదారులు కాచుకూర్చున్నారు. అదే భూమిలో ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని నిరుపేదలు చేస్తున్న పోరాటానికి సీపీఐ(ఎం) అండగా నిలిచింది.
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌ మండలం బావురావుపేట శివారులో సర్వే నెం.8లో 27 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అనేక ఏండ్లుగా పడావుగా ఉన్న ఈ అసైన్డ్‌ భూమిలో ఇంటి స్థలాలు కేటాయించాలని నిరుపేదలు డిమాండ్‌ చేస్తున్నారు. 20రోజులుగా అక్కడే గుడిసెలు వేసుకుని పోరాటం సాగిస్తున్నారు. వీరంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక తరగతులకు చెందిన అత్యంత నిరుపేదలు. ఏండ్లుగా స్థిరనివాసం ఉంటున్నా సొంత జాగా లేక.. ప్రభుత్వ భూమిలో స్థలాలు కేటాయించాలని కోరుతున్నారు. ఏండ్ల తరబడి అగ్గిపెట్టెలాంటి అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇల్లు కట్టించకపోయినా కనీసం జాగానైనా కేటాయించాలని కోరుతున్నారు.
భూమి కాజేందుకు కబ్జాదారుల ప్రయత్నం
తమకు జాగాలు కేటాయించిన పేదలు పోరాడుతున్న ప్రభుత్వ భూమిలో పదేండ్ల నుంచి ఎలాంటి పంటలూ సాగు చేయడం లేదు. పడావుగా ఉంది.
కానీ పేదల భూపోరాటం మొదలైన నాటి నుంచి దాన్ని కాజేందుకు కొందరు కబ్జాదారులు కుట్రలకు తెరలేపారు. బినామీ లబ్దిదారులు పుట్టుకొస్తూ ఈ భూమిని చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. మహిళలు గుడారాలు వేసుకొని ఉంటున్న ఈ స్థలంలో ట్రాక్టర్లను పంపించి దున్నుతున్నారు. రాత్రి వేళలో ఎవరూ అక్కడ లేని సమయంలో ట్రాక్టర్లతో సాగు చేస్తున్నట్టు కనిపించేలా కుటిల యత్నాలకు పాల్పడుతున్నట్టు పేదలు చెబుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు కూడా అక్రమార్కులకే వంతపాడుతున్నట్టు ఆరోపణలు న్నాయి. నిరుపేదలు చేపట్టిన ఈ పోరాటానికి సీసీఐ(ఎం) అండగా నిలిచింది. ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటూ పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తోంది.
తాజాగా డీవైఎఫ్‌ఐ నాయకులు సైతం భూ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ప్రభుత్వం, అధికారులు ఈ భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
సమగ్ర దర్యాప్తు చేయాలి
పైళ్ల ఆశయ్య, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు
బావురావుపేట శివారులో ప్రభుత్వ భూమికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలి. సర్వే నెం.8లోని 27 ఎకరాల అసైన్డ్‌ భూమిని 1973-74లో పేదలకు పంపిణీ చేసినప్పటికీ ప్రస్తుతం అక్కడ అసైన్డ్‌ చేసిన పేదలు లబ్దిదారులుగా లేరు.
ఆక్రమణకు గురైన ఈ భూమిని కాజేసేందుకు కొందరు భూ వ్యాపారులు కాచుకొని కూర్చుకున్నారు. పేదలకు చెందాల్సిన అసైన్డ్‌ భూమిలో లోపాయికారీగా క్రయవిక్రయాలు జరిపి ఇతరులు ధరణి రికార్డుల్లోకి చొరబడ్డారు. ఈ భూమిలో ఇంటి స్థలాల కోసం పోరాడుతున్న పేదలకు ఇవ్వకుండా బెదిరింపు ధోరణి అవలంబిస్తున్నారు.
ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం : రేణుక
తమ పోరాటం ఇండ్ల స్థలాలు సాధించేవరకు కొనసాగుతుంది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వచ్చి భూ పంపిణీ చేపట్టాలి. అప్పటి దాకా మా పోరాటం ఆపేది లేదు. మమ్మల్ని బెదిరించడం సరికాదు. మాకు మద్దతుగా నిలిచిన సీపీఐ(ఎం) నాయకులపై కేసులు నమోదు చేయడం బాధాకరం.
ఇంటి స్థలం ఇస్తే గుడిసె వేసుకుంటాం
కుటుంబ పోషణ కోసం మా ఆయన బఠానీలు అమ్ముతుండగా, నేను కూలీ పనిచేస్తాను.
మాకు ఇల్లు కట్టుకునేందుకు జాగా లేదు.
ఇతరత్రా ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. ఇంటి స్థలం ఇస్తే గుడిసె వేసుకొని జీవిస్తాం.
– టేకం సారక్క
అద్దె ఇంట్లో జీవిస్తున్నాం

భర్త, ఇద్దరు పిల్లలతో ఇరుకైన అద్దె ఇంట్లో ఏండ్లుగా నివాసం ఉంటున్నాం.
ఇప్పటికీ మాకంటూ సొంత ఇల్లు లేదు.
ఇరువై రోజుల నుంచి ఆకలిదప్పులు మాని ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్నాం.
ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎలాంటి భరోసా కల్పించడం లేదు.
ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలం కేటాయించాలి.
– బండారి రాజేశ్వరి

Spread the love