మనసు చేసే మాయ

A trick of the mindఓ రోజు నా స్నేహితునితో వాటర్‌ఫిల్టర్స్‌ కంపెనీవారు ఏర్పాటు చేసిన మీటింగ్‌కు వెళ్లవలసి వచ్చింది. అప్పటికే హాలంతా నిండింది. నేను, నా ఫ్రెండ్‌ వెనుక సీట్లో కూర్చున్నాం. ఆ మీటింగ్‌లో కంపెనీకి చెందిన వ్యక్తి వాటర్‌ ఫిల్టర్‌ నీరే ఎందుకు తాగాలనే విషయం మీద సీరియస్‌గా ఉపన్యసిస్తున్నాడు. ముందు వరుసలో కూర్చున్న వ్యక్తి ఏకధాటిగా దగ్గుతున్నాడు. అందరు ఆయనవైపే చూడసాగారు. పాపం, దగ్గుతున్న ఆయన బయటకు వెళ్లి కొన్ని మంచినీళ్ల తాగి, తగ్గిందనే భావనతో వచ్చి తన సీట్లో కూర్చున్నాడు. పది పదిహేను నిమిషాలు అయిందో లేదో మళ్లీ విపరీతంగా దగ్గడం ప్రారంభించాడు. మళ్లీ అతను బయటకు పోయాడు.
నేనూ ఆయన వెనుక వెళ్లి ”అదేంటండి, దగ్గు మందు వాడడం లేదా?” అన్నాను.
అతను ”సార్‌, ఇప్పుడే కాఫ్‌ సిరప్‌ తాగి వచ్చాను. ఈ పాడు దగ్గు నన్ను ఓ పట్టాన కూర్చోనివ్వడం లేదండి” అన్నాడు. పాకెట్‌లో నుండి ఓ మాత్ర తీసి ఇస్తూ ”ఇది చాలా పవర్‌ ఫుల్‌ టాబ్లెట్‌. ఇక మీకు దగ్గు రమ్మన్నా రాదు” అంటూ ”అక్కడ వాటర్‌ వుంది. ఈ మాత్ర వేసుకుని మంచి నీళ్లు తాగండి” అని చెప్పి వచ్చి కూర్చున్నాను. లోపలికి వస్తూ నమస్కారం చేశాడు కృతజ్ఞతా భావంతో. ఆ తరువాత దాదాపు రెండున్నర గంటలు సాగింది మీటింగ్‌. ఆ వ్యక్తి మాత్రం మళ్లీ దగ్గలేదు. లంచ్‌ చేసేటప్పుడు ఆ వ్యక్తి అనేక సార్లు థ్యాంక్స్‌ చెబుతూ తెల్లకాగితం పెన్నూ నా చేతికిస్తూ ”సార్‌, మీరు డాక్టరా?” అన్నాడు.
నేను ‘అబ్బే, మీకు వచ్చిన లాగే నన్ను కూడా దగ్గు బాధిస్తుంటే తెలిసున్న డాక్టర్‌ దగ్గరికి వెళ్తే రెండు మాత్రలిచ్చాడు. ఒకటి వేసుకున్న నాకు తక్కువైంది. మిగిలున్న మాత్ర మీకిచ్చాను” అంటూ ఆయనిచ్చిన కాగితం మీద నా ఫోన్‌ నెంబర్‌ రాసి ఇస్తూ ”మీకు ఇక దగ్గు అసలే రాదు. నా మాట నమ్మండి. ఒకవేళ మళ్లీ దగ్గు వస్తే నాకు ఫోన్‌ చేయండి” అని చెప్పి మళ్లీ మీటింగ్‌ హాల్లోకి వెళ్లి కూర్చున్నాను. ఆయన వచ్చి దాదాపు మళ్లీ రెండు గంటలు అందరి ఉపన్యాసాలు ప్రశాంతంగా వింటూ కూర్చున్నాడు, మళ్లీ దగ్గు రాకుండా! నన్ను నేను ‘వహ్వారే సైకాలజిస్ట్‌!!’ అనుకుంటూ నవ్వుకున్నాను.
శ్రీకాంత్‌ నేను కలిసి సైకాలజీ చదువుకున్నాం. ఓ రోజు నాకు శ్రీకాంత్‌ కలిసినప్పుడు నేను నిరంతరాయంగా దగ్గే వ్యక్తి దగ్గును ఎలా దూరం చేయగలిగానో చెప్పినప్పుడు ఆయన తన భార్య నీరసాన్ని ఎలా దూరం చేయగలిగాడో చెప్పడం మొదలు పెట్టాడు.
”నా బెస్ట్‌ ఫ్రెండ్‌, క్లాస్‌మేట్‌ జయాకర్‌ అమెరికాలో వుంటున్నాడు. ఓ రోజు వాడు వీడియోకాల్‌లో మాట్లాడుతూ ఊళ్లో వున్న తన తల్లిదండ్రులను చూడ్డానికి వస్తున్నానని చెబుతూ నాతో కూడా రెండు రోజులు గడుపుతానని, ‘మా చెల్లెలు సరస్వతితో మంచి వంటకాలు చేయించి తినిపించాలిరా’ అని కూడా చెప్పాడు.
ఆ వెంటనే నేను మా శ్రీమతితో ‘ఒసే సరూ! ఎప్పుడూ మా మంచి అన్నయ్య అని చెబుతావే, నా ఫ్రెండ్‌ జయాకర్‌ ఇండియా వస్తున్నాడట. తను వీడియోకాల్‌లో మాట్లాడుతూ ‘మా చెల్లెలు సరస్వతితో మంచి వంటకాలు చేయించమని చెప్పా’డోరు. నీక్కావలసిన సామానేదో చెప్పు. వెళ్లి తీసుకొస్తా. నీ నీరసాన్ని దూరం చేసుకొని ఉత్సాహంగా ఎలా వంటలు చేస్తానో నాకైతే తెలీదు సుమా!” అన్నాను. వెంటనే నా సహధర్మచారిణి ”నాకు ఉత్సాహం తెప్పించే బాధ్యత మీదే!” అన్నది.
”జయాకర్‌ నీతో రుచిగా వంట చేయించే బాధ్యత నా మీదే పెట్టాడు. నీకు ఉత్సాహం తెప్పించే బాధ్యత కూడా నామీదే పెట్టావు నువ్వు. అన్నా చెల్లెళ్ల మధ్య నేను నలిగిపోతానో ఏమో!” అంటూ వచ్చిన ఫోన్‌ కాల్‌కు సమాధానం ఇవ్వడానికి బయటికి వచ్చాను. రేపు అర్జంట్‌గా హైదరాబాద్‌ వెళ్లాలని ఆఫీస్‌ నుండి వచ్చిన ఫోన్‌ కాల్‌ అది.
లోపలికి వచ్చి, ”హలో శ్రీమతిగారూ, రేపు హైదరాబాద్‌ వెళ్లాలి. ఆఫీస్‌వారి ఆదేశం. రెండు రోజులు అక్కడే వుండాలి. ఈలోగా నీకు కావలసిన సామానుల లిస్ట్‌ తయారు చేసి పెట్టుకో. రాగానే తెచ్చి పెడతా” అన్నాను.
హైదరాబాద్‌ అబిడ్స్‌లోని ఆఫీస్‌ నుండి కోటి వరకు కాలినడకన వెళ్లేప్పుడు నా శ్రీమతి క్లాస్‌మేట్‌ డా||శ్రీవాణిగారు నన్ను చూసి కారు ఆపగానే నమస్కారం పెట్టాను. ఆవిడ ”నా ఫ్రెండ్‌ ఎలా వుందండీ” అని అడిగారు.
”అదే నీరసం. ఎప్పుడూ నిరుత్సాహంగానే వుంటుందండీ..” అన్నాను. అందుకామె ”మీరు టాలెంటెండ్‌ సైకాలజిస్ట్‌ అని సరస్వతి ఎప్పుడూ చెప్తూ వుంటుంది. బహుశా తనకి మనోవ్యాదేమో అనిపిస్తుంది. దానికి మార్గం మీరే ఆలోచించండి” అంటూ వెళ్లిపోయింది.
ఫ్రెండ్స్‌తో కాఫీ తాగుతూ ఆలోచించడం మొదలు పెట్టాను. ‘యస్‌. బెస్ట్‌ ఐడియా’ అనుకున్నాను మనసులో. మా ఆవిడ నీరసానికి, నిరుత్సాహానికి బెస్ట్‌ మెడిసిన్‌ అనుకున్నాను.
ఇల్లు చేరాను. నా శ్రీమతిని పిలిచి ”సరూ… నీ ఫ్రెండ్‌ డాక్టర్‌ శ్రీవాణి కలిశారు. నీ నీరసం దూరమయ్యే మందు ఇస్తూ ”అన్ని టెస్ట్‌ల తర్వాత ఈ టాబ్లెట్స్‌ నీరసానికి బాగా పనిచేస్తాయని మెడికల్‌ బోర్ట్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చింది” అని నాకు ఈ సీసాలోని టాబ్లెట్స్‌ ఇచ్చింద”ని పాకెట్‌ నుండి తీసి ఇచ్చాను.
”వీటిని ఎలా వాడాలో చెప్పిందా?” అని అడగ్గానే ”సాయంత్రం చెపుతాలే” అన్నాను.
ఎప్పుడూ ఇంత ఉత్సాహం కనబర్చని నా శ్రీమతికి తన ఫ్రెండ్‌ పంపిందని చెప్పగానే ఎంత పెద్దమార్పు అని లోలో సంతోషించాను.
సాయంత్రం టాబ్లెట్స్‌ వాడే విధానం చెప్పానో లేదో వెంటనే తెచ్చుకుని మంచినీళ్లతో టాబ్లెట్స్‌ వేసుకుంది. ఎప్పుడూ ముడుచుకుపోయి వుండే ముఖం గులాబీ పువ్వులా వికసించినట్టు విప్పారింది. ‘గుడ్‌, సక్సెస్‌’ అని ఎగిరి గంతేయాలనిపించింది మనసులో.
మా జయాకర్‌ వచ్చాడు ఇంటికి. రెండు రోజులు మా ఆవిడ ఉదయం పూట కొత్తరకం టిఫిన్స్‌ చేసింది. తరువాత నేనెప్పుడూ తినని స్వీట్‌ పెసరపప్పుతో చేసింది. భోజనాల్లో ఎన్నెన్ని రకాలో! నా భార్యలో అంత మంచి వంటలు చేయగల టాలెంట్‌ వుందని పెండ్లయిన పది సంవత్సరాల్లో ఎప్పుడూ గుర్తించలేకపోయా. జయాకర్‌ వెళ్తూ వెళ్తూ ఎంతగా పొగిడాడో! చివరిగా వాడన్న మాటలు.. ”అరే శ్రీకాంత్‌! నా చెల్లెలు వంటకాల్లో గొప్ప ఘనాపాటిరా!” అనడం ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే విషయంగా నా స్మృతిపథంలో తిష్టవేసింది.
ఇద్దరు సైకాలజిస్ట్‌లు తమను తాము పొగుడుకున్నారే తప్ప శీర్షిక మీద ఫోకస్‌ చేయలేదని పాఠకులకు తప్పక అనిపిస్తుందనుకుంటా! ఆగండి ప్లీజ్‌! అక్కడికే వస్తున్నా..
మనసంటే… మన ఆలోచనలు, మన అంతరంగం. మెదడులో నిక్షిప్తమైన జ్ఞాపకాలు అంటారు మనోవైజ్ఞానికులు. మనసును గుర్రంతో పోల్చుతారు. గుర్రాన్ని స్వేచ్ఛగా వదిలితే ఎటు పరుగెడుతుందో ఎవరికీ తెలియదు. మనసు కూడా అంతే! గుర్రానికి కళ్లెం వేస్తే అది మనం ఎలా చెబితే అలా చేస్తుంది. మనసుకు కూడా అంతేనండి! మనం మనసును అదుపులో వుంచుకోగలిగితే, అది మనకు అద్భుతాలు చేసి చూపిస్తుంది. అదే మనసు చేసే మాయ.
పై రెండు ఉదాహరణల్లో మనసును అదుపు చేసేవిగా టాబ్లెట్లు ద్వారా నమ్మకం కలిగించబడింది. నమ్మకంతో దగ్గు దూరమైంది. రెండో ఉదాహరణలో కూడా అదే నమ్మకం కలిగించడం ద్వారా నీరసం దూరం చేసి ఉత్సాహం కలిగించబడింది.
ఇక్కడ మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్లాసిబో అనే శబ్దం ఉపయోగించబడింది. ఎలాంటి వైద్యగుణాలు లేని మాత్ర మీద నమ్మకం కుదిర్చి తాత్కాలికంగా ఒక వ్యాధిని నియంత్రించడానికి చేయబడే క్రియాత్మక చర్య.
మనసుతో ఏర్పడే నమ్మకం కారణంగా మనసులో ఇంక ఎలాంటి ఆలోచనలకు తావు లేకుండా మనసును కట్టడి చేయడం జరిగేది ప్లాసిబో!
మనం చేసే ప్రతి చర్య మనసు ప్రేరణ వల్లే జరుగుతుంది. మనసు మన చెప్పుచేతల్లో వుంటే ఎన్నో అద్భుతాలు చేయవచ్చంటారు.
మానవుడి దేహంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడానికి మూలం మనసేనని రామాయణం చెబుతుంది. మనసే అన్నింటికీ మూలం అని అందరూ అంగీకరించే సత్యం. అదే మనసు చేసే మాయ. దీన్నే సైకాలజిస్టులు ‘మైండ్‌ చేసే మ్యాజిక్‌’ అంటారు.

– పరికిపండ్ల సారంగపాణి,
9849630290, కౌన్సిలింగ్‌ సైకాలజిస్ట్‌,

Spread the love