బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి

నవతెలంగాణ హైదరాబాద్: రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయింది. మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో మంగళవారం ఈ ఘటన జరగ్గా.. బుధవారం ఆ చిన్నారి మరింత లోతుకు జారిపోయినట్టు అధికారులు తెలిపారు. సెహోర్ జిల్లా సమీపంలోని ముంగావలీ గ్రామంలో బయట ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయింది. తనను బయటకు తీసేందుకు 24 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అది రాతినేల కావడంతో ఆ చిన్నారిని కాపాడటం క్లిష్టంగా మారిందని జిల్లా కలెక్టర్ ఆశీశ్‌ తివారీ మీడియాకు వెల్లడించారు. ‘తొలుత ఆ పాప 20 అడుగుల లోతులో చిక్కుకుపోయింది. ఆ తర్వాత మరో 50 అడుగుల లోతుకు జారిపోయింది. మేం తవ్వుతున్నా కొద్దీ ఆ పాప కిందికి జారిపోతోంది. తనకు ఆక్సిజన్ అందిస్తున్నాం. అది రాతి నేల కావడంతో ఈ సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. సాధ్యమైనంత త్వరగా ఆ చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఆ పాపను సురక్షితంగా వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. దీనిపై రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం పనిచేస్తోందని వెల్లడించారు.

Spread the love