బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి..

నవతెలంగాణ -జామ్‌నగర్‌: బోరు బావుల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి. అయినా ఈ విషయంలో జనాల్లో ఇంకా చైతన్యం రావడంలేదు. నీరుపడని బోరు బావులను, నీళ్లు అడుగంటడంతో నిరుపయోగంగా మారిన బోరు బావులను పూడ్చివేయకుండా వదిలేస్తున్నారు. ఇదే పిల్లలకు ప్రాణ సంకటంగా మారుతున్నది. ఆడుకుంటూ వెళ్లి ఆ బోరు బావుల్లో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌ ఏరియాలో అలాంటి ఘటనే జరిగింది. ఇవాళ ఉదయం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. దాంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకుని బాలికను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, బాధిత బాలిక బోరుబావిలో 20 అడుగుల లోతులో ఇరుక్కుందని జామ్‌నగర్ తాలూకా అభివృద్ధి అధికారి సర్వయ్య చెప్పారు. బోరుబావి మొత్తం లోతు 200 అడుగులు ఉందని తెలిపారు.

Spread the love