ఎంఎస్పీ, రుణమాఫీ కోసం ఐక్య పోరాటం

A united fight for MSP loan waiver– స్పష్టం చేసిన ఎస్కేఎం నేతలు దల్లేవాల్‌ను పరామర్శించిన ఎస్కేఎం ప్రతినిధి బృందం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), అప్పుల బారినుంచి బయటపడేందుకు రైతులకు రుణమాఫీ కోసం ఐక్య పోరాటం కొనసాగుతోందని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నేతలు స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం ఎస్కేఎం ప్రతినిధి బృందం ఖన్నౌరి సరిహద్దుకు చేరుకుని రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ దల్లేవాల్‌ను కలిసింది. దల్లేవాల్‌ నేతృత్వంలోని ఎస్కేఎం (నాన్‌ పొలిటికల్‌) వర్గాన్ని 15న పటియాలాలో జరిగే రైతు సంఘాల సంయుక్త సమావేశానికి ఆహ్వానిస్తూ లేఖను అందజేశారు. పంటలకు లాభదాయక మైన కనీస మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ దల్లేవాల్‌ నవంబర్‌ 26 నుంచి నిరవదిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం విదితమే. పంజాబ్‌ నుంచి ఢిల్లీ చలో మార్చ్‌ చేపట్టిన దల్లేవాల్‌, ఆయన సహచరులను పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని శంభు, ఖన్నౌరి వద్ద హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్‌లోని మోగాలో గురువారం సమావేశమైన కిసాన్‌ మహాపంచాయత్‌ నిర్ణయం ప్రకారం ఎస్కేఎం బృందం దల్లేవాల్‌ను సందర్శించి చర్చలకు ఆహ్వానించింది. కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ మోర్చా, ఎస్కేఎం (నాన్‌ పొలిటికల్‌) ఇతర నాయకులతో కూడా చర్చలు జరిగాయి. ఎస్కేఎం ప్రతినిధి బృందంలో పి. కృష్ణ ప్రసాద్‌, జగ్బీర్‌ సింగ్‌ చౌహాన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, రామిందర్‌ సింగ్‌ పాటియాలా, దర్శన్‌ పాల్‌, జోగిందర్‌ సింగ్‌ ఉన్నారు. 2020 ఉద్యమం తర్వాత కేంద్రం హామీ ఇచ్చిన కనీస మద్దతు ధర, వ్యవసాయ రుణ ఉపశమన పథకం, ఇతర హామీలను సాధించడానికి సమిష్టి ఆందోళన కొనసాగుతుందని నాయకులు విలేకరుల సమావేశంలో తెలిపారు.

Spread the love