ఏకమవుతున్న విపక్షం

– దిగజారుతున్న బీజేపీ గ్రాఫ్‌
– మత ఉన్మాద చర్యల్ని వ్యతిరేకిస్తున్న ప్రజలు
– మోడీ నిర్ణయాలను నిరసిస్తూ ఐక్యతా రాగం
ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. కర్నాటక ఎన్నికల్లో ఆపార్టీ పరాజయం తర్వాత విపక్షాల ఐక్యత మరింత ధృఢంగా మారుతున్నది. దీనికి నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం వివాదాస్పదమై, విపక్షాలను మరోసారి ఏకతాటిపైకి తెస్తున్నది. ప్రజల్లోనూ క్రమేణా ‘మార్పు’ కనిపిస్తున్నది. బీజేపీ మత ఉన్మాద చర్యల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారు. విపక్షాల ఐక్యత 2024 వరకు ఇలాగే కొనసాగితే దేశంలో బీజేపీ పాలనకు చరమగీతం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బీజేపీ ప్రజల నాడిని పక్కతోవ పట్టించే దుందుడుకు చర్యలకు పాల్పడబోదనే భరోసా ఏమీ లేదనీ, అలాంటి చర్యల పట్ల విపక్షాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని విశ్లేషిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఏకతాటి పైకి రావడం ఇది మొదటిసారి కాదు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండీ ఇలాంటి సందర్భాలు అనేకం వచ్చాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే ఇలా అత్యధిక పార్టీలు ఏకమై సంయుక్త ప్రకటనపై సంతకాలు చేశాయి.
న్యూఢిల్లీ : ఈ నెల 28న జరిగే పార్లమెంట్‌ నూతన భవన ప్రారం భోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు నిర్ణయిం చాయి. కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, ఆప్‌ సహా పలు పార్టీలు ఈ మేరకు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం తర్వాత తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. భూసేకరణ సవరణ బిల్లును నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. పారి శ్రామిక అవసరాల కోసం వ్యవసాయ భూముల సేకరణకు కంపెనీలను అనుమతించే ప్రక్రియను సరళతరం చేయడానికి ఈ బిల్లును ఉద్దేశించారు. దీనిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ నేతృత్వంలో 14 పార్టీల ప్రతినిధులు 2015 మార్చిలో పార్లమెంట్‌ నుండి రాష్ట్రపతి భవనానికి ర్యాలీగా వెళ్లారు. అయితే చివరికి ఈ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు పలు సందర్భాలలో ఒకే వేదికను పంచుకొన్నప్పటికీ వాటి మధ్య ఐక్యత కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2020 డిసెంబర్‌లో పార్లమెంట్‌ నూతన భవనానికి ప్రధాని శంకుస్థాపన చేసినప్పుడు ఆ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే సహా పలు ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. అయితే అప్పుడు సంయుక్త ప్రకటన ఏదీ విడుదల చేయలేదు.
2020లో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి రైతుల ఆందోళనపై గళం విప్పాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవ సాయ చట్టాలకు వ్యతిరేకంగా ఐక్యతా రాగం పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రైతులు దేశ రాజధాని సరిహద్దులలో పెద్ద ఎత్తున జరిపిన ఆందోళన ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసింది. ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని 2021 జనవరిలో 17 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. దీనిపై ఆయా పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు 2021 నవంబర్‌లో ప్రధాని మోడీ ప్రకటించారు.

2021 మేలో దేశంలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలకు ఉచితంగా టీకాలు అందించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌ సహా 13 పార్టీలు ఓ ప్రకటన విడుదల చేశాయి. దేశంలోని అన్ని ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ సిలిండర్లను సరఫరా చేయాలని కూడా ఆ పార్టీలు కోరాయి. అప్పటి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆ ప్రకటనపై సంతకాలు చేశారు. వాక్సిన్‌ కొరత కారణంగా 18-44 సంవత్సరాల మధ్య వయస్కులకు పలు రాష్ట్రాలు టీకాల కార్యక్రమాన్ని నిలిపివేసిన సందర్భంలో కూడా 12 పార్టీల నేతలు ప్రధానికి లేఖ రాశారు. వాక్సిన్‌ను కొనుగోలు చేసి, రాష్ట్రాలకు ఉచితంగా అందించాలని కోరారు.
జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఫాదర్‌ స్టాన్‌ స్వామి చనిపోవడంపై పది ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయనపై తప్పుడు కేసులు మోపి, జైలులో నిర్బంధించి, అమానుషంగా ప్రవర్తించిన వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఆ పార్టీలు రాష్ట్రపతికి వినతిపత్రం అందజేశాయి. భీమా కోరేగావ్‌ కేసులో నిర్బంధంలో ఉన్న వారందరినీ విడుదల చేయాలని కూడా డిమాండ్‌ చేశాయి. అదే విధంగా మతహింస, విద్వేషపూరిత ప్రసంగాలపై ఆందోళన వ్యక్తం చేసిన 13 ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాలలో ప్రధాని మౌనాన్ని దుయ్యబడుతూ గత సంవత్సరం ఏప్రిల్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
తమ నాయకులపై సీబీఐ, ఈడీ వంటి సంస్థలను ఏకపక్షంగా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ 14 పార్టీలు ఈ సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిని తొలుత అనుమతించిన న్యాయస్థానం ఆ తర్వాత తోసిపుచ్చింది. ఈ విధంగా పలు సందర్భాలలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు సంఘటితమై పోరాటం సాగిస్తున్నాయి.

Spread the love