నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోడీకి ఘన స్వాగతం

నవతెలంగాణ-కంటేశ్వర్ : నిజామాబాద్ పర్యటనకు విచ్చేసిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రధాని మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ( న్యూ కలెక్టరేట్)కు చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరపున రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రధానికి బొకేలు అంధించి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐ.జీ చంద్రశేఖర్ రెడ్డి, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, , ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ప్రధానికి సాదర స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రత్యేక కాన్వాయ్ లో ప్రధాని నరేంద్రమోడీ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానానికి చేరుకున్నారు. ముందుగా అధికారిక కార్యక్రమాలలో పాల్గొని పలు ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేసి నూతన ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలోనే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బహిరంగ సభ అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా తిరుగు పయనమైన ప్రధాని నరేంద్రమోడీకి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాని అధికారికంగా పాల్గొన్న కార్యక్రమానికి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
Spread the love