ప్రపంచాన్ని మార్చే ఆయుధం పుస్తకం

A weapon that can change the world is a book– భావ విప్లవానికి పునాది మనిషి ఆలోచన, మార్పునకు పుస్తకమే శ్రీకారం
– డిజిటల్‌ విప్లవం కమ్మేసినా పఠనం తగ్గలేదు : 37 వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ముగింపు సభలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
”కారల్‌ మార్క్స్‌ రాసిన కమ్యూనిష్టు మ్యానిఫెస్టో ప్రపంచ గతిని మార్చింది. పుస్తకం కొత్త ఆలోచనలకు, కొత్త దారులకు, మార్పుకు శ్రీకారం చుడుతుందని చరిత్ర నిరూపించింది. పుస్తకాలు చదివిన ఎంఎన్‌ రారు, అంబేద్కర్‌, గాంధీ, నెహ్రూ లాంటి వారు ప్రపంచంపై తమదైన ముద్ర వేశారు. తుపాకీ కన్నా పుస్తకం పదునైంది. పుస్తకాలు చదివితే సమాజాన్ని చదివినట్టే. ఫేస్‌ బుక్‌లు, వాట్సప్‌లు వదిలి పుస్తకాలను చదివేలా మనతో పాటు మన పిల్లల్ని తయారు చేయాలి. అప్పుడే మంచి సమాజం నిర్మితమవుతుంది” అని పలువురు వక్తలు అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈనెల19న కొలువుదీరిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ 37వ జాతీయ పుస్తక ప్రదర్శన ఆదివారం అట్టహాసంగా ముగిసింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాధారాణి మాట్లాడుతూ ”ఒకప్పుడు ప్రతి ఊర్లో గ్రంథాలయం ఉండేది. అందులో చదుకున్న వారు చాలా మంది పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. పుస్తకం మనల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ప్రపంచంలో అనేక మార్పులకు పుస్తకాలే శ్రీకారం చుట్టాయి. చిన్నప్పుడు నేను చదివిన రైలు బండి నన్ను ప్రభావితం చేసిన పుస్తకం. ఓల్గా సే గంగా, ఫౌంటెన్‌ హెడ్‌, ఇన్‌ ఫిడిల్‌ తదితర పుస్తకాలు సమాజాన్ని తీవ్ర ప్రభావితం చేశాయి. లండన్‌ లైబ్రరీలో ఎక్కువ పుస్తకాలు చదివిన వారిలో ఒకరు కార్ల్‌ మార్క్స్‌ అయితే ఇంకొకరు అంబేద్కర్‌. అందుకే వారు ప్రపంచం మెచ్చే గొప్పవాళ్లయ్యారు. పుస్తకాలు చదవడంతో పాటు, పిల్లల్ని చదివించాలి” అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కోదండరామ్‌ మాట్లాడుతూ ”కంప్యూటర్లు, డిజిటల్‌ మాద్యమాలు ఎన్ని వచ్చినా పుస్తకాల విలువ తగ్గలేదు. సాప్ట్‌ వేర్‌ ఉద్యోగులు పుస్తకాలు చదువుతుండటమే మార్పునకు సంకేతం. ప్రజలకు పుస్తకాలు అందుబాటు లోకి తేవాలని వట్టి కోట ఆళ్వారుస్వామి నెత్తి మీద మూటలా పెట్టుకొని ఊరూరా తిరిగి పాఠకులకు అందిం చారు. హైదరాబాద్‌ను ప్రభావితం చేసే ప్రదర్శనగా హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ నిలిచింది. ఇదే సాంప్ర దాయాన్ని భవిష్యత్‌లో కొనసాగిస్తూ మంచి పుస్తకాలను పాఠకులకు అందించాలి. హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు సొంత కార్యాలయం గురించి సీఎం కూడా సానుకూలంగా ఉన్నారు. త్వరలో అది కార్యరూపం దాలుస్తుందని భావిస్తున్నాను” అని కోదండరామ్‌ వ్యాఖ్యానించారు. ప్రముఖ పాత్రికేయులు రామ చంద్రమూర్తి మాట్లాడుతూ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ పాఠకులకు మరింత మంచి పుస్తకాలు అందిస్తూ మందుకు సాగాలని ఆకాంక్షించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన బుక్‌ఫెయిర్‌ అధ్యక్షులు కవి యాకుబ్‌ మాట్లాడుతూ గతానికి భిన్నంగా పుస్తకాల పండుగలో బాలోత్సవం, సాహితీ కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణలు జరిగాయని పేర్కొన్నారు. బుక్‌ఫెయిర్‌ కార్యదర్శి ఆర్‌.శ్రీనివాస్‌(వాసు) మాట్లాడుతూ అంచ నాలకు భిన్నంగా ఈ ఏడాది దాదాపు 13 లక్షల మందికి హాజరయ్యారని అన్నారు. పుస్తకాలకు పెరుగుతున్న ఆదరణకు సందర్శకులు పెరగడమే నిదర్శనమని పేర్కొన్నారు. బుక్‌ ఫెయిర్‌కు సహకరించిన ప్రభుత్వం, కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, పాత్రికేయులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్య క్రమంలో బుక్‌ ఫెయిర్‌ ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, శోభన్‌ బాబు, సంయుక్త కార్యదర్శి సురేష్‌, సూరి బాబు, కోశాధి కారి నారాయణ రెడ్డి, కార్యవర్గ సభ్యులు కుమార్‌, ఎన్‌.కోటేశ్వర్‌రావు, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, స్వరాజ్‌ కుమార్‌, పాల్గొన్నారు.

Spread the love