– హరగోపాల్‌తోపాటు మరో 152 మంది ఉపా కేసులు నమోదు చేయడం పై :టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఫ్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు మరో 152 మందిపై తాడ్వాయి పోలీస్‌స్టేషన్లలో ఉపా కేసులు నమోదు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి విమర్శించారు. ఈ పాలకులు ప్రజాస్వామ్యవాదులను భయపెట్టాలని చూస్తున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమాజం గర్వించదగ్గ గొప్ప మేధావి హరగోపాల్ అని కొనియాడారు. పౌర హక్కుల కోసం ఆయన అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడి ప్రజాహక్కులను కాపాడారని గుర్తు చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో పౌర హక్కుల కోసం పాఠాలు బోధించారని వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర ఏర్పాటు కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం పని చేశారని తెలిపారు. నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని ప్రకటించిన కేసీఆర్, హరగోపాల్ నక్సలైట్లకు సహకరిస్తూ దేశ ద్రోహానికి పాల్పడుతున్నారని కేసులు పెట్టడం అప్రజాస్వామిక చర్య అని అభిప్రాయపడ్డారు. నక్సలైట్ల ఎజెండానే మా ఏజండా అని ప్రకటించిన కేసీఆర్‌పైన కూడా కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. వారిపై నమోదు చేసిన ఉపా కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామిక, పౌర సంఘాలు బీఆర్‌ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల కోసం పని చేస్తుండడంతో ప్రభుత్వాలు ఇలా పాశవికంగా ప్రవర్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హరగోపాల్‌తోపాటు 152 మంది పైన ఉపా కేసులు ఎత్తేస్తామని రేవంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.