ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

నవతెలంగాణ – అశ్వారావుపేట : మండలంలోని మల్లాయిగూడెం కు చెందిన కొమరం వెంకటేశ్(32)కు భార్య సత్యవతి,ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు ఉన్నారు.కాగా ఈ నెల 2వ తేదిన తన కుమార్తె జ్ఞాన ప్రియ ను గాడ్రాల గ్రామంలోని వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్ద దింపి వచ్చేందుకు వెళ్లాడు.తిరిగి ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు.తెల్లవారే 3వ తేదిన దబ్బతోగు – మల్లాయిగూడెం మార్గ మధ్యలో రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా పడి ఉన్నాడు. అయితే ఘటన స్థలంలో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందినట్లు ఉండగా, కుటుంబీకులు,తల్లి సైతం వెంకటేశ్ మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. దాంతో అదే రోజు మృతుడి తల్లి కొమరం నాగమ్మ పోలీసులకు అనుమానాస్పద మృతిగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా రోడ్డు ప్రమాదం కాదని హత్య చేసినట్లు తేలింది.
అశ్వారావుపేట మండలం గోపన్న గూడెం కు చెందిన గొంది లక్ష్మణరావు అనే వ్యక్తితో కొమరం వెంకటేశ్ భార్య కొమరం సత్యవతి తో గత కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు పడుతున్నాడు అనే నెపంతో భార్య,తన ప్రియుడు తో కలిసి హత్యకు పథకం పన్నారు.ఈ పథకం ప్రకారమే గాడ్రాల వెళ్లిన వెంకటేశ్ తిరిగి రాత్రి 7 గంటల సమయంలో స్వగ్రామానికి ద్విచక్రవాహనం పై వస్తుండగా
దబ్బతోగు – మల్లాయిగూడెం మార్గమధ్యలో దారి కాశారు. వారిద్దరి ముందస్తు ప్రణాళిక ప్రకారం ద్విచక్రవాహనం పై వస్తున్న వెంకటేశ్ ను ఒక్కసారిగా అడ్డగించి,రోడ్డు పక్కకు లాక్కుని వెళ్ళి చెట్ల పొదలు లో ముందే సిద్ధం చేసుకున్న కొడవలి,రాయితో అతనిపై దాడికి పాల్పడి హతమార్చారు.ఆ తర్వాత వెంకటేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సీఐ వివరించారు.మృతుడి తల్లి నాగమ్మ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ కేసు మిస్టరీ ని చేధించడం విశేషం. హత్య కేసులో ముద్దాయిలు ఇద్దరినీ అరెస్ట్ చేసి,వారి వద్ద నుంచి హత్యకు వినియోగించిన కొడవలితో పాటు రక్తపు మరకలు ఉన్న రాయి ని స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అనంతరం ముద్దాయిలు సత్యవతి,గొంది లక్ష్మణ్ రావును కోర్టుకు తరలించారు.
Spread the love