శతకోటి జనహృదయ విజేత,

శతవసంతాల శఖపురుషుడు ఆయన.. నిత్య నీరాజనాలు అందుకున్న జననేత విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ, నటరత్న, పద్మశ్రీ నందమూరి తారక రామారావు(మే 28,1923 – జనవరి 18,1996). ఆయన తెలుగు సినీ వినీలాకాశంలో ఓ సంచలనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై ఆయన ఓ ప్రభంజనం.. నటుడిగా ప్రజల గుండెల్లో కొలువైన రూపం. నాయకుడిగా ప్రజారంజక పాలనకు నిలువెత్తు రూపం. తెలుగు జాతి ఆత్మగౌరవం హస్తిన వీధుల్లో పరాభవానికి గురవుతున్న సమయంలో ఢిల్లీ అహంకారంపై తిరుగుబావుటా ఎగరేసి, తలఎత్తి తెలుగోడి సత్తా చాటిన ఆత్మగౌరవ పతాక ఎన్టీఆర్‌. రాజకీయ వారసత్వం లేదు. తాతలు.. తండ్రుల చరిత్ర లేదు. ఉన్నదల్లా ప్రజాభిమానం ఒక్కటే. రంగేసుకునే వాళ్లకు రాజకీయాలేంటని విమర్శించిన నోళ్లనే ఔరా అనిపించేలా అడుగులేశారు. ఎన్టీఆర్‌ కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లో అతి తక్కువ సమయంలోనే సంచలనం సృష్టించారు.13 ఏండ్ల రాజకీయ జీవితంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. మే 28వ తేది నాడు ఆయన శతజయంతి సందర్భంగా ఆయన సినీ, రాజకీయ ప్రస్థానంపై నవతెలంగాణ ‘సోపతి’ పాఠకుల కోసం అందిస్తున్న కవర్‌ పేజీ స్టోరీ.
ఎన్టీఆర్‌ ఏ పాత్ర చేసినా గుండెలకు హత్తుకుంటుంది.. ఏ డైలాగు చెప్పినా ఆలోచింపజేస్తుంది.. దేశం గర్వించదగిన నటులలో అగ్రస్థానంలో ఉంటారు.. ఆ పాత్ర ఈ పాత్ర అని లేదు. పౌరాణిక, జానపద, సాంఘీక, చారిత్రిక చిత్రాలలోని వైవిధ్యమైన మరపురాని పాత్రలకు ఆయనే చిరునామా. రాముడైనా-రావణుసురుడైనా.. కృష్ణుడైనా- ధుర్యోధనుడైనా.. కర్ణుడైనా-అర్జునుడైనా ఇలా ఏ పౌరాణిక పాత్ర పోషించినా ఆయనదో ప్రత్యేకమైన శైలి. అందుకే తెలుగు వారి హృదయాలలో ఆరాధ్య దైవంగా నిలిచిన రామారావు తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు.
సినిమా రంగంలో కథానాయకుడిగా, రాజకీయరంగంలో మహా నాయకుడిగా ఆ జగద్విఖ్యాత నేత సాగించిన ప్రస్థానం అనితర సాధ్యం. క్రమశిక్షణ, కార్యదక్షత ఉంటే ఒక వ్యక్తి తన్ను తాను ఎంతగా విస్తృత పరచుకోవచ్చో.. ఎంతటి ఉన్నత శిఖరాలను అధిష్టించవచ్చో చెప్పటానికి ఎన్టీ రామారావు జీవితమే ఒక ఉదాహరణ. ఎన్టీఆర్‌ వ్యక్తిత్వంలో ఉన్న కొన్ని గొప్ప లక్షణాలే ఆయనను చిరస్మరణీయుడుగా, ప్రాత: స్మరణీయుడుగా నిలబెట్టాయి. చాలామంది జీవితం ఎటు నడిపిస్తే, ఎలా నడిపిస్తే అలా నడుస్తారు. దక్కిందే చాలు, దొరికిందే చాలు అనే పరిమిత ఆనందాలతో సంతృప్తి పడిపోతారు. కానీ తాను నిర్దేశించినట్లుగా, తాను శాసించినట్లుగా జీవిత గమనాన్ని సాగించటం ఎన్టీఆర్‌ లాంటి కార్యదక్షులకే సాధ్యం. ఏదో అదృష్టం కలిసి వచ్చి సినిమా హీరోని అయ్యాను, డబ్బుకు డబ్బు, గ్లామర్‌ కు గ్లామర్‌, పేరు ప్రఖ్యాతులతో కూడిన సకల భోగాల జీవితం దొరికింది చాలు అనుకొని ఉంటే ఎన్టీ రామారావు అనే ఒక మహోన్నత వ్యక్తిత్వ శిఖరాన్ని మనం చూడగలిగే వాళ్ళం కాదు.
ఒక సాదారణ వ్యక్తిని ఆసామాన్య శక్తిగా.. ఎదురులేని ఎలికగా మార్చిన చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా తెలుగు గడ్డ నిలిస్తే.. ఆ నేల గర్వించే ఎత్తులకు ఎదిగిన తెలుగు తేజం విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజల ఇళ్ళల్లో ఇలవేల్పుగా, గుండెలలో తెరవేల్పుగా శాశ్వత స్థానం సంపాదించుకున్నారాయన. తెలుగు అన్న పదం చెప్పగానే తొలిసారిగా స్పూరించే పేరు ఎన్టీఆర్‌ అంటే అతియోశక్తి కాదు. తెలుగు జాతితో అంతా ప్రగాఢమైన సానిహిత్యాన్ని పెనవేసుకున్నవారు మరొకరు మనకు కనిపించరు. మొక్కవోని దైర్యం, మడమతిప్పని కార్యదక్షత, క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల, అసంభావాన్ని సంభవం చేయగల సమర్థత.. ఇలాంటి అరుదైన లక్షణాల వల్లే ఎన్టీఆర్‌ ఒకే ఒక్కడుగా అటు సినీ రంగంలోనూ, ఇటూ రాజకీయ రంగంలోనూ నిలిచారు. పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసినా, నాయక, ప్రతి నాయక పాత్రలను పోషించినా, యువకుడి నుండి ఎనబై ఏళ్ల వృద్దుడి వరకు ఏ పాత్ర చేసినా ఎన్టీఆర్‌ తప్ప మరెవ్వరూ చేయలేరని కితాబును అందుకోవడం ఆయనకే చెల్లింది. మూడున్నర దశబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఎదురులేని మనిషిగా ఏలిన శఖపురుషుడు ఎన్టీఆర్‌. రామారావులా తెలుగు చలనచిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు శాసించగలిగిన వ్యక్తి.. తెలుగు వారి పౌరుషాన్ని నలుచెరగులా చాటిచెప్పి రాజకీయాలను మలుపు తిప్ప గలిగిన శక్తి లేదని చెప్పాలి.

నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్‌ విజయవాడకు దగ్గర్లోని ఓ చిన్న పల్లెటూరు నిమ్మకూరులో 1923 మే 28వ తేదీన నందమూరి లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ మునిసిపల్‌ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన రామారావు, తరువాత విజయవాడ ఎస్‌.ఆర్‌.ఆర్‌. కాలేజీలో చేరారు. అక్కడ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు విభాగానికి అధిపతి. ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నారు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి ‘ససేమిరా’ అన్నారు. మీసాలతోటే నటించడం వలన అతనికి ‘మీసాల నాగమ్మ’ అనే పేరు తగిలించారు.1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు. పెళ్ళయిన తరువాత పరీక్షల్లో రెండుసార్లు తప్పారు. తర్వాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో చేరారు. అక్కడ కూడా నాటక సంఘాల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేవారు. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌ నేషనల్‌ ఆర్ట్‌ థియేటర్‌ గ్రూప్‌ అనే నాటక సంస్థను స్థాపించి, కొంగర జగ్గయ్య, ముక్కామల, నాగభూషణం, కె.వి.ఎస్‌.శర్మ తదితరులతో కలిసి అనేక నాటకాలలో పాత్రలు వేశారు. ఎన్టీఆర్‌ మంచి చిత్రకారుడు కూడా కావడం వల్ల రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో బహుమతులను గెలుచుకున్నారు. ఆ తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ ఉద్యోగంలో చెరినప్పటికీ కళారంగం పట్ల ఆయనకున్న మమకారం చివరికి సినిమాల వైపు దృష్టి మరలేలా చేసింది.
సినిమా రంగంలో..
మొదట ఎన్టీఆర్‌ స్ఫురద్రూపం, నటనా కౌశలం గమనించిన ఎల్‌.వి.ప్రసాద్‌ ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చారు. కానీ, ఆ సినిమా ఆలస్యం కావడంతో, ఆయన ‘మనదేశం’ సినిమాలో ఓ పోలీస్‌ అధికారి పాత్రలో నటించారు. 1949 లో విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్‌ తెరంగ్రేటం చేసిన తొలి సినిమా అయ్యింది. ఆ తర్వాత 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. 1950 లో వచ్చిన ‘షావుకారు’ సినిమాతో ఎన్టీఆర్‌ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. 1951లో విడుదలైన ‘పాతాళబైరవి, మల్లీశ్వరీ’ సినిమాలు ఎన్టీఆర్‌కు హీరోగా సామాన్య ప్రజలలో తిరుగులేని స్థానాన్ని సంపాదించి పెట్టాయి. అలాగే మిస్సమ్మ, గుండమ్మ కథ సినిమాలు ఎన్టీఆర్‌ ను క్లాస్‌, మాస్‌ హీరోగా నిలబెట్టాయి. 1956లో విడుదలైన ‘మాయాబజార్‌’లో రామారావు తొలిసారి శ్రీకృష్ణుడిగా నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలకు ఈ చిత్రంతోనే నాంది పలికారు. వెండితెరపై కృష్ణుడంటే రామారావే అనేంతగా బలమైన ముద్ర వేసారు. ఆ తరువాత ఎన్టీఆర్‌ కృష్ణుడిగా 18 చిత్రాల్లో కనిపించి మురిపించారు. అంతర్నాటకాల్లో కలపి మొత్తంగా 30కి పైగా చిత్రాల్లో ఎన్టీఆర్‌ శ్రీకృష్ణ పాత్రలో కనిపించారు. కాగా రామారావు తొలిసారిగా రాముని గెటప్‌లో ‘చరణదాసి’ అనే సాంఘిక చిత్రంలో కనిపించారు. రామారావు శ్రీరాముని గెటప్‌లో పూర్తి స్థాయిలో కనిపించింది మాత్రం తెలుగు సినిమాలో కాదు… తమిళంలో తీసిన ‘సంపూర్ణ రామాయణం’లో. ఆ తర్వాత 1963లో విడుదలైన ‘లవకుశ’ సినిమా.. రాముడిగా ఎన్టీఆర్‌కు ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టింది. ఆపై ‘రామాంజనేయ యుద్ధం’, ‘శ్రీరామ పట్టాభిషేకం’ వంటి సినిమాల్లో రాముడి పాత్రలో మెప్పించారు. 1959లో ఎవియమ్‌ వారు నిర్మించిన ‘భూకైలాస్‌’ చిత్రంలో రావణబ్రహ్మ పాత్రకు జీవం పోసారు రామారావు. ఆ తర్వాత తన సొంత బ్యానర్‌ ఎన్‌ఎటి పై నిర్మించిన ‘సీతారామ కళ్యాణం’ చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించారు. అందులో రావణుడిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత ‘వేంకటేశ్వర స్వామి మహత్యం’, ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో వేంకటేశ్వరుడిగా మెప్పించారు. ఆయన నటంచిన చిత్రాల్లో దాదాపు 97 శాతం చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర సక్సెస్‌ సాధించడం విశేషం. పౌరాణికాలే కాకుండా జానపద సినిమా హీరోగా ఎన్టీఆర్‌ తిరుగులేని మాస్‌ ఇమేజ్‌ సంపాదించుకున్నారు. 1977లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అడవిరాముడు’ తో ఎన్టీఆర్‌ క్రేజ్‌ ఎన్నో రెట్లు పెరిగింది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌ హీరోగా సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలు పెట్టారు. తర్వాత వరుస పెట్టి మాస్‌ సినిమాలతో దడదడ లాడించారు. అడవి రాముడు విడుదలకు ముందు అదే ఏడాది విడుదలైన ‘దాన వీర శూరకర్ణ’ ను ఎవరూ మరిచిపోలేరు. అందులో ఆయన పోషించిన శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన పాత్రలు అనితర సాధ్యమనే చెప్పాలి. అంతేకాదు దాదాపు 4 గంటల నిడివి కలిగిన ఈ సినిమాను ఎలాంటి కోతలు పెట్టకుండా విడుదల చేసినా అఖండ విజయం సాధించింది. అంతేకాదు.. 1977లో ఒకే యేడాదిలో ‘దాన వీర శూర కర్ణ’, ‘అడవిరాముడు’, ‘యమగోల’ వంటి మూడు బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌తో ఇండిస్టీ హిట్స్‌ ఎన్టీఆర్‌ అందుకున్నారు. ఒకే ఏడాదిలో మూడు ఇండిస్టీ హిట్స్‌ అందుకున్న ఏకైక హీరో ఎన్టీఆర్‌ కావడం విశేషం. ఇదే సంవత్సరం ‘చాణక్య చంద్రగుప్త, మా ఇద్దరి కథ’ విడుదలై సక్సెస్‌ సాధించడం విశేషం. 1979లో యన్టీఆర్‌ ‘శ్రీమద్విరాట్‌ విరాట్‌ పర్వం’లో 5 పాత్రలు పోషించి మెప్పించారు. ఈ సినిమాలో శ్రీకృష్ణ, దుర్యోధన, కీచక, అర్జున, బృహన్నల పాత్రల్ని అవలీలగా పోషించి తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు. అంతకు ముందు ‘జగదేకవీరుని కథ’లో శివశంకరి పాటలో ఐదు పాత్రల్లో తొలిసారి కనిపించారు. అలాగే యన్టీఆర్‌ స్టార్‌గా వెలుగుతున్న దశలోనే తాత, తండ్రి, మనవడు పాత్రల్లో ‘కులగౌరవం’ అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేసారు. పేకేటి శివరాం దర్వకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యన్టీఆర్‌ నటించిన అరుదైన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఇక ద్విపాత్రాభినయం కలిగిన చిత్రాల్ని లెక్కలేనన్ని పోషించారు యన్టీఆర్‌. ‘నా దేశం’ చిత్రం యన్టీఆర్‌ నటించిన ఆఖరి మాస్‌ చిత్రంగా నిలిచిపోయింది. ఆ తరువాత ఆయన తెలుగు దేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగుతూ ఉండగానే యన్టీఆర్‌ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సమ్రాట్‌ అశోక’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’, ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ లాంటి చారిత్రక, పౌరాణిక చిత్రాలు తీసి తనకు తానే సాటి అనిపించుకున్నారు. తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో 12 చిత్రాలు వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సక్సెస్‌ సాధించాయి. అంతేకాదు ప్రపంచ సినీ చరిత్రలో ఓ తండ్రీ కొడుకులు హీరోలుగా ముఖ్యపాత్రల్లో ఇన్ని సినిమాల్లో నటించిన వాళ్లు ఎవరు లేరు. ఇది ఒక రికార్డు.
రాజకీయ రంగంలో..
తన 60 వ పుట్టిన రోజుకు ముందు ఆదరించిన తెలుగు ప్రజల కోసం ప్రతి నెలలో 15 రోజులు తెలుగుప్రజల సేవకోసం కేటాయిస్తానని ప్రకటన ఎన్టీఆర్‌ రాజకీయ ప్రయాణానికి మొదటి సంకేతం అయ్యింది. రాష్ట్రంలో ఆనాడు ఉన్న పరిస్థితిని గమనించిన రామారావు 1982 మార్చి 29 సాయంత్రం 2:30లకు కొత్త పార్టీ పెడుతూ, ఆ పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటించాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును ‘చైతన్యరథం’ గా రూపుదిద్ది, ఆ రథంపై ‘తెలుగుదేశం పిలుస్తోంది, రా! కదలి రా!!’ అనే నినాదంతో తెలుగునాట ఓట్లేయండని జనంలోకి వచ్చారు. ఆయనకి జనం నీరాజనాలు పలికారు. ఎన్టీఆర్‌ ప్రతి మాట ఓ తూటాగా పేలింది. కాంగ్రెస్‌ పార్టీ వల్ల.. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నదని, దానిని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శిస్తూ, ఆ ఆత్మగౌరవ పునరుద్ధరణకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాల పట్ల అప్పటికే విసుగు చెందిన ప్రజలు ఆయన నినాదం పట్ల ఆకర్షితులయ్యారు. అలా కొద్ది రోజుల్లోనే మహా ప్రభంజనంలా మారిన తెలుగుదేశం ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే 1983 ఎన్నికల్లో 199 స్థానాలతో ఘన విజయం సాధించింది. తొలి కాంగ్రెసేతర సీఎంగా తనను ఆదరించిన ప్రజల సమక్షంలోనే ప్రమాణస్వీకారం చేశారు. రంగేసుకునే వాడికి రాజకీయం ఏం తెలుస్తుందన్న ప్రత్యర్థుల విమర్శలకు పాలనతో, పథకాలతో సమాధానం చెప్పారు. పాలనలో పారదర్శకత, నీతి నిజాయతీలకు మారు పేరుగా నిలిచారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్లారు.
ఎన్టీఆర్‌ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఒక సంచలనం. ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ఓ ప్రభంజనం. ప్రతి పేదోడి కడుపు నింపాలన్న సదాశయంతో రెండు రూపాయలకే కిలో బియ్యమిచ్చి చరిత్ర సష్టించారు ఎన్టీఆర్‌. ఇక జనతా వస్త్రాల పథకంతో ప్రతి పేదవాడికీ కనీస అవసరమైన వస్త్రాలను అందించారు. ఇక అప్పట్లోనే బడుగు వర్గాలకు లక్షలాదిగా ఇళ్లు కట్టించి కొత్త సంచలనానికి తెర తీశారు. పేదల కనీస అవసరాలైన ‘రోటీ కపడా ఔర్‌ మకాన్‌’కు ఎక్కడా లోటు లేకుండా చూశారు. స్త్రీలకు కూడా ఆస్తిలో హక్కు కల్పిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక సంపూర్ణ మద్యపాన నిషేధంతో మహిళల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తెలుగులోనే అన్ని పాలనా వ్యవహారాలు సాగేలా నిర్ణయం తీసుకున్నారు.
1984 ఆగష్టులో నాదెండ్ల భాస్కరరావు రామారావును అధికారం నుంచి తొలగించినపుడు, తనను దొడ్డిదారిన దింపి నాదెండ్ల భాస్కరరావు గద్దెనెక్కారంటూ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పేరుతో రామారావు ప్రజల్లోకి వెళ్ళారు. జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటారు. ఫలితంగా రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. ఇక 1985-89 మధ్య కాలంలో ఎన్టీఆర్‌ పరిపాలన పరంగా కొంత అప్రతిష్టను మూట గట్టుకుంది. మొండిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు 1989 ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో కాంగ్రెస్‌ పార్టీ తెలుగుదేశాన్ని ఓడించి తిరిగి అధికారంలోకి వచ్చింది. అదే ఎన్నికల్లో హిందూపురం నుంచి.. కల్వకుర్తి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌ హిందూపురం నుంచి గెలిచిన, కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. 89 లో అధికారం కోల్పోవడంతో 1994 వరకు ఎన్టీఆర్‌ ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
లక్ష్మీ పార్వతి తో వివాహం
1989 లో అధికారం కోల్పోవడంతో ఎన్టీఆర్‌ అనారోగ్యం పాలయ్యాడు. ఆ సమయంలో ఆయన జీవిత చరిత్ర రాయడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి ఒంటరిగా ఉంటున్న ఎన్టీఆర్‌ కు సేవలు అందించడంతోపాటు, రెండో పెళ్లి చేసుకుంటే తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని కొంతమంది జ్యోతిష్యులు చెప్పడంతో ఆయన 1993లో తన 70వ ఏట తన సహచరిగా ఉంటున్న లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. రామారావు జీవితంలోకి భార్యగా ప్రవేశించిన లక్ష్మీ పార్వతి 1994 ఎన్నికలలో ఆయన వెంట ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంది. కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి ఎన్టీఆర్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే ఎన్టీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన తర్వాత ప్రభుత్వంలో, పార్టీలో భార్య లక్ష్మీపార్వతి జోక్యం మీతిమీరడంతో విబేధించిన శాసన సబ్యులు, కుటుంబ సబ్యులు చంద్రబాబు నేతత్వంలో తిరుగుబాటు చేసి ఎన్టీఆర్‌ ను ముఖ్యమంత్రి పదవి నుండి దింపివేశారు. 1994 ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఎన్టీఆర్‌ తన పదవీకాలం పూర్తి కాకుండానే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. పదవి కొల్పోయిన అనంతరం తీవ్ర మనోవ్యధకు గురయిన రామారావు1996 జనవరి18న గుండెపోటుతో మరణించారు. మే 28, 1923 ఈ జగమనే నాటకరంగంలో అడుగుపెట్టి తన పాత్రను అద్బుతంగా పోషించి.. జనవరి 18, 1996 నాడు నిష్క్రమించిన ఎన్టీఆర్‌ ఒక గొప్ప నటుడుగా, గొప్ప ప్రజానాయకుడుగా తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచారు.
ఎన్టీఆర్‌ సంతానం
ఎన్టీఆర్‌, బసవతారకం దంపతులకు 12 మంది పిల్లలు. వీరిలో 8 మంది మగ సంతానం కాగా, 4 అమ్మాయిలు. వారి మొదటి కుమారుడు ‘రామకృష్ణ’ చిన్నప్పుడే చనిపోయాడు. రెండవ కొడుకు ‘జయకృష్ణ’. ఆ తర్వాత నందమూరి ‘సాయి కృష్ణ’. ఈయన కూడా చనిపోయారు. ఇక ఐదవ సంతానమైన నాలుగవ కుమారుడు ‘హరికృష్ణ’. ఈ మధ్య కాలంలోనే మరణించారు. ఇక ఐదవ కుమారుడు ‘మోహనకృష్ణ’. ఆ తర్వాత కుమారుడు బాలకృష్ణ. ఇక ఏడవ కుమారుడు ‘రామకృష్ణ జూనియర్‌’. మొదటి కుమారుడు మరణించడంతో ఆ పేరు ఈయనకు పెట్టారు. ఎనిమిదవ కుమారుడు ‘జయశంకర కృష్ణ’ కాగా మూడవ సంతానంగా పుట్టిన అమ్మాయి ‘పురందరేశ్వరి’. ఆ తర్వాత తొమ్మిదవ సంతానంగా ‘భువనేశ్వరి’, మూడవ కూతురు ”లోకేశ్వరి”. ఇక నాలుగవ కుమార్తె ‘ఉమా మహేశ్వరి’. ఆమె ఇటీవలే మతి చెందారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్‌ ఎనిమిది మంది కొడుకుల్లో ముగ్గురు, ఒక కూతురు ‘ఉమా మహేశ్వరి’ సహ నలుగురు చనిపోయారు.
బహుముఖ ప్ఞ్రశాలి
ఎన్టీఆర్‌ నటుడిగానే కాకుండా దర్శకుడిగా 16 సినిమాలు, నిర్మాతగా 8 సినిమాలు రూపొందించారు. ఆయన స్టూడియో అధినేతగా… రాజకీయ వేత్తగా… ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రికార్డులను సష్టించిన బహుముఖ ప్ఞ్రశాలి. తెలుగు ప్రజలందరి చేత అన్నా అని పిలుపించుకున్న మహానటుడు ఎన్టీఆర్‌. విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితుడైన అతను 44 ఏళ్ళ సినిమా జీవితంలో దాదాపు 300 కు పైగా నటించిన సినిమాలలో 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక, 44 పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ 1968 భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డ్‌ అందుకున్నారు. 1978లో ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు ‘కళాప్రపూర్ణ’ స్వీకరించారు.
ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం
తెలుగు సినిమా కీర్తిపతాకాన్ని రెపరెపలాడించి, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని దశదిశలా చాటిన మహానటుడు, మహానాయకుడు ఎన్టీఆర్‌ పేరిట 1996 లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ‘ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాన్ని’ నెలకొల్పింది. ఈ అవార్డు క్రింద 5 లక్షల నగదుతో పాటు మోమొంటో బాహుకరిస్తారు. 1996 నుండి ఈ అవార్డును 2016 నంది అవార్డులతో కలిపి ప్రకటించిన ప్రభుత్వం ఆ తరువాత రాష్ట్ర విభజనతో నంది అవార్డులు నిలిచి పోయిన కారణంగా ఈ అవార్డు కూడా ఇవ్వడంలేదు.


– పొన్నం రవిచంద్ర, 9440077499

Spread the love