వీల్‌ చైర్‌లోనే మహిళ ప్రసవం

A woman gives birth in a wheelchair– నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఘటన
– పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణి పట్ల సిబ్బంది నిర్లక్ష్యం!
– ఆస్పత్రిలో అదనపు కలెక్టర్‌ విచారణ
– నిర్లక్ష్యం వహించిన డాక్టర్లు, నర్సులపై చర్యలు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం దారుణ ఘటన జరిగింది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళకు తీవ్ర రక్త స్రావమై వీల్‌ చైర్‌లోనే ప్రసవించింది. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని కుటుంబీకులు ఆరోపించారు. కాగా, ఈ ఘటనపై కలెక్టర్‌ విచారణకు ఆదేశించగా.. అదనపు కలెక్టర్‌ ఆస్పత్రిని సందర్శించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ముకు చెందిన ఆంజనేయులు, అశ్విని దంపతులకు ఇప్పటికే ఇద్దరు సంతానం కాగా మూడో కాన్పు కోసం గురువారం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అశ్వినిని పరీక్షించిన వైద్యులు కాన్పు కష్టంగా ఉందని చెప్పి మెరుగైన చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి పంపించారు. దీంతో ఆంజనేయులు అశ్వినిని అంబులెన్స్‌లో గురువారం రాత్రి 2:30 నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతున్న అశ్విని పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాన్పు కోసం ఇక్కడి దాకా ఎందుకొచ్చారు.. దేవరకొండలో కాన్పు చేయలేరా అంటూ ఆంజనేయులుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీల్‌ చైర్‌లోనే కూర్చోబెట్టారు. అప్పుడే తీవ్ర రక్తస్రావమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది వెంటనే అశ్వినిని లోపలికి తీసుకెళ్లి తల్లీబిడ్డకు వైద్య సేవలు అందించారు. సిబ్బంది తీరును నిరసిస్తూ అశ్విని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.
ఘటనపై విచారణకు కలెక్టర్‌ ఆదేశం
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల వీల్‌ చైర్‌లోనే మహిళ ప్రసవించిన విషయం తెలుసుకున్న కలెక్టర్‌ నారాయణరెడ్డి విచారణకు ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్రకు సూచించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర ప్రభుత్వాస్పత్రికి వచ్చి అశ్వినిని, ఆమె భర్త ఆంజనేయులును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి సిబ్బందితోనూ మాట్లాడారు. అంతేకాక ఆస్పత్రి పర్యవేక్షకులు, ఆర్‌ఎంఓ, డ్యూటీ డాక్టర్ల నుంచి సంఘటన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అశ్విని ఆస్పత్రికి వచ్చిన సమయంలో విధుల్లో నర్సులు, డాక్టర్‌ ఎవరున్నారో విచారించారు.
డాక్టర్‌, నర్సులపై చర్యలు
నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని, విధుల పట్ల అలసత్వం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌ పూర్ణచంద్ర మీడియా ప్రతినిధులతో చెప్పారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే.. అక్కడ డాక్టర్‌ లేనందున డ్యూటీలో ఉన్న నర్సులు అంబులెన్స్‌ ఏర్పాటు చేసి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి పంపించినట్టు తెలిసిందని అన్నారు. అయితే, ఇలాంటి సందర్భాల్లో అనుభవం ఉన్న వారి సహాయం లేకుండా నిండు గర్భిణిని నడవమని సలహా ఇచ్చిన నర్సు లేదా ఇతరుల వల్లే ఈ ఘటన జరిగిందని గుర్తించామన్నారు. దీనికి బాధ్యులైన డ్యూటీ డాక్టర్‌ నిఖిత, స్టాఫ్‌ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ, సుజాతకు సోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. అంతేకాక గురువారం రాత్రి డ్యూటీలో ఉండకపోవడంపై దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్‌ శాంతి స్వరూప, విధుల్లో ఉన్న స్టాఫ్‌ నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితను సస్పెండ్‌ చేయాలని డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించినట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాథమిక నివేదికను సమర్పించామన్నారు.
నిర్లక్ష్యం జరగలేదు
అశ్విని అర్ధరాత్రి 2:30 గంటలకు డెలివరీ కోసం వచ్చారు. పురిటి నొప్పులు వచ్చి పోతుండటంతో ఫ్రీ డెలివరీ కోసం వాకింగ్‌ చేయాలని డ్యూటీలో ఉన్న సిబ్బంది చెప్పారు. వాకింగ్‌ చేసి అలసిపోయి కుర్చీలో కూర్చోగానే డెలివరీ అయింది. వెంటనే సిబ్బంది తల్లీబిడ్డకు వైద్య సేవలు అందించారు. ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఆస్పత్రిలో ఎలాంటి నిర్లక్ష్యం జరగలేదు. వచ్చిన వెంటనే పరిశీలించి బెడ్‌ని కూడా కేటాయించాం. తెల్లవారుజామున 3:56 గంటలకు డెలివరీ అయింది.
-డాక్టర్‌ రమణ మూర్తీ : ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌

Spread the love