– డాక్టర్ హెచ్.నర్మద
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జీవితంలోని వివిధ దశలు దాటే స్త్రీ తన ఆరోగ్యసంరక్షణ కోసం అవగాహన కలిగి ఉండటం చాలా అవసరమని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ హెచ్.నర్మద తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో 1977 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనంలో ఆ బ్యాచ్‌కు చెందిన 150 మందికి పైగా డాక్టర్లు, తన క్లాస్ మేట్స్ సమక్షంలో నర్మద ‘స్త్రీ’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యుక్త వయస్సు నుంచి రుతువిరతి (మెనోపాజ్) వరకు వచ్చే మార్పులపై ఈ పుస్తకం అవగాహన కలిగిస్తుందని తెలిపారు. మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ప్రయోజనం కలిగించే రీతిలో పుస్తకాన్ని రాసినట్టు చెప్పారు. యుక్తవయస్సు నుంచి రుతువిరతి వరకు, స్త్రీ శరీరం హార్మోన్ల మార్పులు, యుక్తవయస్సు పునరుత్పత్తి సామర్ధ్యం ప్రారంభమైతే, సూచిస్తుంది రుతువిరతి దాని ముగింపు అని తెలిపారు. మెనోపాజ్‌కు దారితీసే పెరిమెనోపాజ్ దశలు, వేడి ఆవిర్లు, రాత్రి చెమటలు, మూడ్ స్వింగ్‌లు ఇలాంటి ఎన్నో సమస్యలతో సతమతమయ్యే మహిళలకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ నర్మద తెలిపారు. యుక్తవయస్సు, వివాహం, శిశుజననం, నవజాత శిశువులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, మెనోపాజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ (పీసీఓడీ), పోషకాహారం, గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, రొమ్ము క్యాన్సర్, వంధ్యత్వం, టెస్ట్ ట్యూబ్ బేబీ, చైల్డ్ న్యూట్రిషన్ తదితర ఆసక్తికర విషయాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.