కడపలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య..

నవతెలంగాణ-కడప: నగరంలో పట్టపగలు దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుర్ఖా ధరించి వైసీపీ కార్యకర్త శ్రీనివాసులు రెడ్డిని కత్తులతో పొడిచి హత్య చేశారు. భూతగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడపకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మరి కొంతమందితో భూతగాదాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ఇవాళ జిమ్‌ నుంచి ఇంటికి వస్తున్న సమయంలో శ్రీనివాసులుని ఇద్దరు వ్యక్తులు బుర్ఖా ధరించి వచ్చి.. విచక్షణా రహితంగా కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి మృతి చెందారు. ఆర్టీసీ ఛైర్మన్‌ మల్లిఖార్జున్‌ ఆస్పత్రికి చేరుకుని హత్యకు గల కారణాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Spread the love