– ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి ఐదారేండ్లు ?
– రూ.2500 కోట్లు డిపాజిట్ చేయండి
– సర్కారుకు ఎన్‌హెచ్‌ఏఐ మెలిక
– పనికొద్దీ నిధులిస్తాం : రాష్ట్రం స్పష్టీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రాంతీయ వలయ రహదారి(ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి ఆటంకాలు ఒక్కొక్కటిగా సమసిపోతున్న దశలో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. ప్రాజెక్టుకు భూసేకరణే అత్యంత కీలకం. ఈ విషయంలో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తే ఇక భౌతిక నిర్మాణ పనులు చేపట్టడానికి వీలవుతుంది. ఇందులో ప్రగతి ఉంటేనే ప్రాజెక్టును ముందుకు సాగించడానికి పరిస్థితులు అనువుగా మారుతాయని అధికారుల అంచనా. ఇటీవల ఢిల్లీలో, రాష్ట్రంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశాల నేపథ్యంలో ప్రాజెక్టు పరిపాలనా అనుమతుల ప్రక్రియ కొంత ముందుకెళ్లింది. కేంద్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు ఆర్‌ఆర్‌ఆర్ ప్రక్రియ వేగవంతానికి అడుగులు పడ్డాయి.
రెండింతలు
ఔటర్ రింగు రోడ్డు(ఓఆర్‌ఆర్) నిర్మాణానికి, రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) నిర్మాణానికి చాలా తేడా ఉంది. ఓఆర్‌ఆర్ కేవలం 180 కిలోమీటర్లు అయితే, ఆర్‌ఆర్‌ఆర్ దాదాపు 350 కిలోమీటర్లు. అంటే దాదాపు రెండింతలు ఎక్కువ. అప్పట్లోనే భూసేకరణకు చాలా సమయం పట్టింది. అనుకున్న నిర్మాణ అంచనాలు సైతం దాటింది. రైతుల భూములు ఓఆర్‌ఆర్‌లో చాలా పోయాయి. రాజకీయ పక్షపాతం చూపించారనే ఆరోపణలు, విమర్శలు అనేకం వచ్చాయి. కోర్టుల్లో కేసులు పడ్డాయి. దీంతో అనుకున్నంత వేగంగా పనులు సాగలేదు. ప్రస్తుత పరిస్థితి సైతం అలాగే ఉంది.
ఆర్‌ఆర్‌ఆర్‌కు భూసేకరణకు అనేక అడ్డంకులు ఉన్నట్టు సమాచారం. ఉత్తర, దక్షిణ భాగాల్లో భూసేకరణకే దాదాపు రూ. 5000 కోట్లు కావాలి. ఇందులో 50:50 నిష్పత్తి చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంది. అయితే కేంద్రం 50 శాతం అంటే రూ. 2500 కోట్లు ముందుగానే ఎన్‌హెచ్‌ఏఐ ఖాతాలో డిపాజిట్ చేయాలని మెలికపెట్టింది. ఈ మేరకు రాష్ట్ర జాతీయ రహదారుల విభాగానికి సమాచారం పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభు త్వంతో చర్చించిన సంబంధిత అధికారులు ఎన్‌హెచ్‌ఏఐకి ఉత్తరం రాశారు. ఇప్పటికే బడ్జెట్‌లో ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణ కోసం రూ. 100 కోట్లు కేటాయించింది. అయితే కేంద్రం ఒకేసారి మొత్తం డబ్బును డిపాజిట్ చేయాలని కోరడంతో సర్కారు ఇరకాటంలో పడింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకే ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆలోచనలో పడింది. వెంటనే భూసేకరణ చేసే కొద్ది డబ్బును విడుదల చేస్తామంటూ ఎన్‌హెచ్‌ఏఐకి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
4781 ఎకరాలకు 1459 ఎకరాలు
మొత్తం ప్రాజెక్టుకు 4781 ఎకరాల భూమికి గాను ఇప్పటివరకు 1459 ఎకరాలను మాత్రమే సేకరించారు. గత బీఆర్‌ఎస్ సర్కారు ఎన్‌హెచ్‌ఏఐ పదే పదే విజ్ఞప్తులు చేసినా భూసేకరణపై దృష్టిపెట్టకపోవడంతో ప్రాజెక్టు దాదాపు రెండున్నరేండ్లు ఆలస్యమైంది. ఇటీవల సమీక్షలపై సమీక్షలు చేస్తున్న తాజా సర్కారు, భూసేకరణను వచ్చే సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలని భావిస్తున్నది. అక్టోబరులో ప్రధానితో శంకుస్థాపన చేయాలని నిర్ణయించింది.
అయితే నిధుల కోణంలో పరిశీలిస్తే భూసేకరణకే ఏడాది సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ప్రభుత్వాలు తొందర పెడుతున్నా, ఆచరణలో భూసేకరణ అంత సులభం కాదని చెబుతున్నారు. ఓఆర్‌ఆర్‌లో తలెత్తిన సమస్యలకంటే, ఆర్‌ఆర్‌ఆర్ భూసేకరణలో ఆ సమస్యలు ఎక్కువగా వస్తాయనే అంచనాతో ఉన్నారు. వీటన్నింటినీ పరిష్కరించాల్సి వస్తుందనీ, అలా చేయకపోతే కోర్టు కేసులై ప్రాజెక్టు మరింత ఆలస్య మయ్యే ప్రమాదం ఉంటుందని అధికారిక సమాచారం.
దీంతో ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉందనేది ఉన్నతాధికారుల అభిప్రాయం. ఇదిలావుండగా ఉత్తర, దక్షిణ విభాగాలను కలిపేసి ఒకటే రహదారిగా మలిస్తే సరిపోతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్ సమక్షంలో జరిగిన సమీక్షలో నిర్ణయించారు. దీంతో దీనిపై కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం.
రూ.30 వేల కోట్లు..?
తొలుత ఆర్‌ఆర్‌ఆర్ రెండు భాగాలకు కలిపి రూ. 26 వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. తాజాగా పనులు ప్రారంభం కాకముందే ఆ అంచనాలు రూ.30 వేల కోట్లకు చేరినట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆలస్యం కావడమే. ఉత్తరభాగం అలైన్‌మెంటు ఖరారైనా టెండర్లు పిలవలేదు. దీంతో ప్రణాళికా దశలోనే తీవ్ర జాప్యం చోటుచేసుకుంటుండటం గమనార్హం. భూసేకరణ కూడా ప్రధాన అడ్డంకిగా ఉందని సమాచారం.
2018లో…
ఆర్‌ఆర్‌ఆర్‌ను 2018లో ప్రతిపాదించారు. ఉత్తర భాగం 164 కిలోమీటర్లు. రూ.9500 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత వ్యయం పెరిగింది. సంగారెడ్డి, నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి, చౌటుప్పల్ గుండా ఈ రోడ్డు వెళ్లనుంది. అలైన్‌మెంటు ఖరారైంది. దక్షిణ భాగం 182 కిలోమీటర్లు. తొలుత దీనికి రూ.6480 కోట్లు అవసరమని భావించారు. దీని ఖర్చు కూడా ఆ తర్వాత పెరిగింది. చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, ఆమన్‌గల్, చేవెళ్ల, శంకర్‌పల్లి, సంగారెడ్డి గుండా నిర్మించాలని ప్రతిపాదించారు.