నవతెలంగాణ – అశ్వారావుపేట
పెద్దలను కాదని, ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువ దంపతులు ఆత్మహత్య రూపంలో మృత్యువాత పడ్డారు. క్షణికావేశంలో ఉరి వేసుకుని తనువు ముగించారు. మృతురాలు కుడివి రమ్య(20) తండ్రి గంగులు పిర్యాదు మేరకు ఎస్.ఐ రామక్రిష్ణ తెలిపిన వివరాలు ప్రకారం అశ్వారావుపేట పంచాయితీ మద్ది రావమ్మగుడి సెంటర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఎర్రం కృష్ణ, రమ్య గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వారావుపేటకు చెందిన ఎర్రం క్రిష్ణ, దమ్మపేట మండలం నెమలి పేట కు చెందిన రమ్య మూడేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. కృష్ణ తాపీ పని చేస్తూ, భార్య రమ్య రోజు వారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెళ్లి తర్వాత నుంచి కృష్ణ తల్లి నాగమ్మ ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ యువ దంపతులిద్దరూ 16 రోజుల క్రితమే మద్ది రావమ్మ గుడి సెంటర్లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వేరే కాపురం పెట్టారు. వీరి మధ్య గడిచిన మూడు నెలలుగా కుటుంబ కలహాలతో మనస్పర్థలు నెలకొనగా, రెండు నెలల క్రితమే పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టి ఇద్దరిని కలిసి జీవించమని చెప్పారు. ఈ క్రమంలో తాజాగా మళ్లీ దంపతుల మధ్య కుటుంబ కలహాలు కారణంగా గొడవ మొదలు కాగా, ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోగా దంపతులిద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా కృష్ణ తల్లి నాగమ్మ కొడుకు ఫోన్ చేస్తే పని చేయకపోవడంతో హుటాహుటిన ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టిన తీయక పోవడంతో చుట్టు పక్కల వారికి చెప్పింది.దాంతో వారంతా వచ్చి ఇంటి తలుపులు బద్దలు కొట్టి తెరిచి చూసే సరికే ఇద్దరు మృతి చెంది కనిపించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సీఐ కరుణాకర్, ఎస్.హెచ్.ఒ 2 ఎస్సై శివరామకృష్ణ ఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.మృతదేహాలను అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి కి తరలించి శవ పంచనామా జరిపించారు. ఈ ఆత్మహత్య ఘటనలపై మృతురాలు రమ్య తండ్రి కుడివి గంగులు చేసిన లిఖిత పూర్వక ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ శివరామ క్రిష్ణ తెలిపారు.