ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్‌.. యువకుడు ఆత్మహత్య

నవతెలంగాణ – గురుగ్రామ్‌: ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్‌ అయిందని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడో యువకుడు. శివమ్‌ భాట్నాగర్‌ (25) అనే యువకుడు తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనకు ముందు యువకుడు మంగళవారం సాయంత్రం 6.45గంటల సమయంలో తన తండ్రినుద్దేశించి ఆకాశ్ అనే స్నేహితుడికి సూసైడ్‌ నోట్‌ను పంపాడు. అందులో ‘నాన్నా.. నన్ను క్షమించండి.. నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నా’ అని పేర్కొన్నట్లుగా పోలీసులు తెలిపారు.  తన ఫ్రెండ్‌ పంపించిన లేఖను చూసిన యువకుడు తీవ్ర ఆందోళనకు గురై జరిగిన విషయాన్ని శివమ్‌ తండ్రి సంజయ్ భాట్నాగర్‌కు ఫోన్‌ చేసి చెప్పాడు. జాకాబ్‌పురలోని ఓ ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న ఆయన.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. శివమ్‌ ఉండే గది తలుపులను బద్దలుకొట్టి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు కుమారుడు విగతజీవిగా వేలాడుతుండటం చూసిన ఆ తండ్రి బోరున విలపించారు. కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే శివమ్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తన కొడుకు ఆత్మహత్యకు యువతి, ఆమె మరో స్నేహితుడే కారణమంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సంజయ్‌ పేర్కొన్నారు. శివమ్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు యువతితోనే మాట్లాడాడని, ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు తెలిపాడు. అతడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love