బొలెరో వాహనం ఢీకొని యువకుడు మృతి

A young man died after being hit by a bolero vehicle– అత్తాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ-రాజేంద్రనగర్‌
ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం వేగంగా ఢీ కొట్టడంతో అందులో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హసనగర్‌కు చెందిన మోసిన్‌ (18) తన స్నేహితునితో కలిసి ఆదివారం ఉదయం శివరాంపల్లి నుంచి ఆరాంఘర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నారు. పిల్లర్‌ నెంబర్‌ 266 వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ని వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢ కొట్టింది. దాంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. బైక్‌ నడుపుతున్న మోసిన్‌ తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అతని స్నేహితునికి స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love