– తలకు ఆపరేషన్ అనంతరం ఘటన
– వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన
– మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో ఘటన
నవతెలంగాణ-బోడుప్పల్
ఆస్పత్రిలో తలకు ఆపరేషన్ అనంతరం ఓ యువకుడు మృతిచెందాడు. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అలా జరిగిందంటూ బంధువులు ఆందోళన చేశారు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ జేపీ ఆస్పత్రిలో బుధవారం జరిగింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన అజరు(32) తండ్రి పంజాల రవి రెండు నెలల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి అజరు మానసికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దాంతో ఘటకేసర్ మండలం కాచవాణి సింగారం ముత్వేల్లిగూడెంలో నివాసం ఉంటున్న సోదరి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో ఈనెల 15న బాత్ రూంకు వెళ్తున్న సమయంలో కండ్లు తిరిగి పడిపోవడంతో కుబుంబ సభ్యులు పీర్జాదిగూడలోని శబరి గార్డెన్ సమీపంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతనికి తలకు సంబంధించిన సమస్య ఉందని, వెంటనే పీర్జాదిగూడలోని జేపీ ఆస్పత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించారు. అక్కడ పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని.. ఏమీ కాదని జేపీ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ భార్గవ్ అజరు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. అనంతరం న్యూరో సర్జన్ డాక్టర్ బ్రహ్మ ప్రసాద్ నేతృత్వంలోని అజరుకి ఆపరేషన్ చేశారు. అందుకుగాను కుటుంబసభ్యులు సుమారు 3 లక్షలు రూపాయల బిల్లు కట్టారు. అంతాబాగానే ఉందన్న వైద్యులు.. బుధవారం ఉదయం గుండెపోటుతో అజరు మృతిచెందాడని చెప్పారు. కుటుంబ సభ్యులు లబోదిబోమంటు గుండెలు బాదుకున్నారు. తాము వేరే ఆస్పత్రికి తీసుకెళ్తామని చెప్పినా.. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారని ఆందోళన వద్దని చెప్పి ఇప్పుడు మృతిచెందాడని చెప్పటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల కిందటే భర్తను కోల్పోయిన మృతుడి తల్లి.. ఇప్పుడు ఎదిగిన కొడుకు కూడా దూరమవ్వడంతో గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. అజరు మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు.
అతన్ని కాపాడే ప్రయత్నం చేశాం..డాక్టర్ ఉదరు, మత్తు ఇంజక్షన్ వైద్యులు, జేపీ ఆస్పత్రి
అజరు మెదడులో రక్తస్రావం సమస్యతో తమ ఆస్పత్రికి వచ్చాడు. అప్పటికే అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. పరీక్షించిన వైద్య బృందం అతని సమస్యను కుటుంబ సభ్యులకు వివరించింది. అతన్ని కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాం. ఆపరేషన్ అనంతరం అతనికి గుండెపోటు రావడంతోనే మృతిచెందాడు.