మనస్థాపంతో యువకుడు బలవన్మరణం


– నానాటికీ పెరుగుతున్న బలవన్మరణాల సంఖ్య

– అధిక సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత

నవతెలంగాణ – ఆళ్ళపల్లి:  కుటుంబ సభ్యులు మందలించారని మనస్థాపంతో క్రిమి సంహారక (మోనో) మందు తాగి యువకుడు బలవన్మరణం పొందిన ఘటన ఆళ్ళపల్లి మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతానగరం గ్రామానికి చెందిన మొగిలిపల్లి శేఖర్ (21)ను మంగళవారం ఉదయం ఇంటి పనులు పట్టించుకోకుండా తిరుగుతున్నావని తండ్రి వెంకటేశ్వర్లు మందలించడంతో చేను కాడికి పోతున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లాడు. చేను వద్ద ఉన్న తాటి చెట్ల దగ్గర మనస్థాపం చెందిన శేఖర్ పురుగుల మందు తాగుతూ వీడియో తీసి, తోటి మిత్రులకు సమాచారం అందజేశాడు. దాంతో హుటాహుటిన మిత్రులు, కుటుంబ సభ్యులు ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి శేఖర్ ను ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తీసుకుని వెళ్ళమని వైద్య సిబ్బంది కుటుంబ సభ్యులకు సూచించారు. దాంతో ఓ టాటా మ్యాజిక్ లో కొత్తగూడెం తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శేఖర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో చేతికి అందిన కొడుకు మృతి చెందాడని తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, సాంబరాజ్యం కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదిలా ఉంటే సోమవారం పండుగ రోజున మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన పడిగ శంకర్ అనే యువకుడు సైతం పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మండల పరిధిలోని మర్కోడు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన సంతోష్ అనే యువకుడు మద్యం మత్తులో పురుగుల మందు తాగినానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు ఎందుకైనా మంచిదని ఓ ఆటోలో మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం తరలించారు. ఏది ఏమైనా ఆళ్ళపల్లి మండలంలో క్రిమి సంహారక మందులు తాగి చనిపోయే కేసులు రోజు రోజుకూ పెరుగిపోతున్నాయి. రెండు నెలల కాల వ్యవధిలో మండల వ్యాప్తంగా అధిక సంఖ్యలో క్షణికావేశంలో యువతనే ఎక్కువగా బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కోకొల్లలు. సంబంధిత అధికారులు ఆత్మహత్యల నివారణకు సరైన చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపడితే గాని మండలంలో బలవన్మారణాలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం లేదని పలువురు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Spread the love