నడిరోడ్డుపై యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపాడు..వీడియో వైరల్

నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్ర రాజధాని ముంబయిలో దారుణం చోటు చేసుకొంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఓ వ్యక్తి తన మాజీ ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్‌తో దారుణంగా హత్య చేశాడు. అక్కడున్న వారు ఈ ఘోరాన్ని చూస్తూ నిలబడ్డారే కానీ.. ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయత్నించలేదు. దీనికి సంబంధించిన భయానక దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ముంబయికి చెందిన రోహిత్‌ యాదవ్‌ ఓ యువతితో కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నాడు. కొన్ని కారణాల వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో యువతి రోహిత్‌ను దూరం పెట్టింది. వేరొకరితో సన్నిహితంగా ఉంటుందేమోనన్న అనుమానం పెంచుకున్నాడు. అదే యువతి పాలిట శాపంగా మారింది. మంగళవారం ఉదయం పనికి వెళుతున్న ఆమెను రోహిత్‌ వెంబడించాడు. ఈ క్రమంలోనే ఇనుప రెంచీతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆమె నేలకొరిగింది. అయినా సరే.. యువతిని పలుమార్లు కొట్టాడు. ప్రాణాలు తీస్తున్నా ఆ ఘోరాన్ని ఆపేందుకు అక్కడున్న వారు ప్రయత్నించకుండా చోద్యం చూశారు. తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు.

Spread the love