బంగ్లా పార్లమెంట్‌ రద్దు

– నోబెల్‌ గ్రహీత యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం
– పలు ప్రాంతాల్లో అవామీ లీగ్‌ కార్యాలయాలకు నిప్పు
– హసీనాకు భారత్‌ సాయం
ఢాకా : విద్యార్ధుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని హసీనా రాజీనామా చేసి దేశం వీడివెళ్ళడంతో బంగ్లాదేశ్‌లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించేందుకు నోబెల్‌ బహుమతి గ్రహీత మహ్మద్‌ యూనస్‌ అంగీకరించారు. ”విద్యార్ధులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. అందుకు వారు మూల్యం కూడా చెల్లించారు. విద్యార్ధులే ఇంతలా త్యాగాలు చేస్తే, నేను కూడా కొంత బాధ్యత తీసుకుంటాను. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వుంటాను.” అని ఆయన పేర్కొన్నారు. ఆర్మీ నేతృత్వంలో లేదా ఆర్మీ మద్దతు గల ఏ ప్రభుత్వాన్ని ఆమోదించేది లేదని విద్యార్ధి సంఘాలు స్పష్టం చేయడంతో యూనస్‌ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్‌ ఎంపికను విద్యార్ధి సంఘాలు కూడా ఆమోదించాయి. తాత్కాలిక ప్రభుత్వ కూర్పుపై విద్యార్థి సంఘాల నేతలతో ఆర్మీ చీఫ్‌ ఈ రోజు చర్చలు జరుపుతారని భావిస్తున్నారు. అంతకుముందే బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌ను అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ రద్దు చేశారు. ఎన్నికలకు మార్గం సుగమం చేశారు. పార్లమెంట్‌ను మంగళవారం రద్దు చేయాలని విద్యార్ధి సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. ఆ నేపథ్యంలో అధ్యక్షుడు చర్యలు తీసుకున్నారు.
హసీనాకు భారత్‌ సాయం
ఇదిలా వుండగా, సోమవారం సాయంత్రం భారత్‌ చేరుకున్న పదవీచ్యుతురాలైన బంగ్లా ప్రధాని హసీనాకు సాయమందిస్తామని భారత్‌ హామీ ఇచ్చింది. మంగళవారం నాటి అఖిల పక్షంలో విదేశాంగ మంత్రి జై శంకర్‌ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం షాక్‌లో వున్న హసీనా తన భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు కొంత సమయం ఇచ్చినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌లో వున్న 10వేల మందికిపైగా భారతీయ విద్యార్థులు, 19వేలమందికి పైగా భారత పౌరుల భద్రతపై అక్కడి ఆర్మీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. హసీనా ఒకటి రెండు రోజుల కన్నా భారత్‌లో వుండకపోవచ్చునని భావిస్తున్నారు. బ్రిటన్‌లో ఆశ్రయం కావాలని ఆమె కోరారని, దానికి ఆమోదముద్ర రాగానే ఆమె వెళ్ళిపోతారని అధికారులు చెబుతున్నారు.
అమెరికా సుద్దులు !
దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్న సమయంలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా వుండాలంటూ అమెరికా సుద్దులు చెప్పింది. బంగ్లాదేశలో హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడానికి తెర వెనుక నుండి చేయాల్సినదంతా చేసిన బైడెన్‌ సర్కార్‌ బయటకు మాత్రం వేదాలు వల్లిస్తోంది. దేశ ప్రజల సంకల్పానికి తగినట్లుగా, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడాలని చెబుతోంది. ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయించేది అక్కడి ప్రజలేనని వ్యాఖ్యానిస్తూ, తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది.
ఇది ప్రజా తిరుగుబాటు సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో
నిరంకుశవాద, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్ధుల నేతృత్వంలో ప్రజలు సాగించిన తిరుగుబాటుతో బంగ్లాదేశ్‌లో ప్రధాని షేక్‌ హసీనా పదవీచ్యుతురాలైదని, ఆమె ప్రభుత్వం కుప్పకూలిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో పేర్కొంది. ప్రజా నిరసనలు, ఆందోళనలను దారుణంగా అణచివేయడం వల్ల 300మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేసింది. దేశంలో శాంతి సుస్థిరతలను పునరుద్ధరించేందుకు ప్రజాస్వామ్య, లౌకికవాద శక్తులు సమైక్యంగా కలిసి కృషి చేయాల్సి వుందనీ. విదేశీ శక్తుల మద్దతుతో లబ్ది పొందాలని చూస్తున్న మితవాద, ఛాందసవాద శక్తుల నీచపుటెత్తుగడలను తిప్పికొట్టాలంటే ఇది తప్పనిసరని సూచించింది.
హౌటల్‌కు నిప్పు
24మంది సజీవ దహనం
సైనిక పాలనలో వున్న బంగ్లాదేశ్‌లో విధ్వంసం, అల్లర్లు, హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా జషోర్‌ జిల్లాలో అవామీ లీగ్‌ ప్రధాన కార్యదర్శి షాహిన్‌ చక్లాదర్‌కి చెందిన జబీర్‌ ఇంటర్నేషనలల్‌ హౌటల్‌కు అల్లరి మూకలు నిప్పంటించారు. ఈ ఘటనలో 24మంది సజీవ దహనమయ్యారని మీడియా పేర్కొంది. పైగా అగ్నిమాపక సిబ్బంది హౌటల్‌కు రాకుండా అల్లరి మూక అడ్డుకోవడంతో పరిస్థితి మరింత బీభత్సంగా తయారైంది. 21 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనల్లో ఇప్పటివరకు వందలాదిమంది మరణించగా, తాజా ఘటనతో మృతుల సంఖ్య 440కి చేరుకుంది. చాలాచోట్ల అవామీ లీగ్‌ పార్టీ కార్యాలయాలకు నిప్పంటించారు. లూటీలు, గృహ దహనాలు కొనసాగుతున్నాయి. హసీనా రాజీనామా చేసి దేశం వీడిన రోజునే దేశంలో 109మంది మరణించారు.మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో సహా పలువురు ఖైదీలను విడుదల చేస్తూ అధ్యక్షుడు షహబుద్దీన్‌ ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచదేశాల ఆందోళన
రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారత్‌కు చేరుకున్నారు. అదే సమయంలో సోమవారం బంగ్లాదేశ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. మరో వంద మందికిపైగా మరణించగా, వేలాదిమంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. వీరిలో అత్యధిక శాతం మంది బుల్లెట్‌ గాయాలయ్యాయి. కాగా, బంగ్లాదేశ్‌లో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రపంచ దేశాలు ప్రకటించాయి. హసీనా రాజీనామా ప్రజల శక్తిని రుజువుచేస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) అధ్యక్షుడు తారిఖ్‌ రెహమాన్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రజల హక్కులు, స్వేచ్ఛకు భద్రత కల్పించే ప్రజాస్వామ్య, అభివృద్ధి చెందిన దేశంగా బంగ్లాదేశ్‌ను పునర్‌నిర్మించాలని కోరారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ప్రవాసంలో ఉన్నారు.
భారత్‌ : భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ఉన్న 4,096 కి. మీ సరిహద్దుల్లో హైఅలర్ట్‌ జారీ చేసింది.
ఐరాస : బంగ్లాదేశ్‌ ప్రజల పక్షాన నిలిచామని, వారికి పూర్తి సంఘీభావం తెలుపుతున్నట్లు ఐరాస పేర్కొంది. హింసాత్మక పరిస్థితులపై పూర్తి స్వతంత్ర, నిష్పాక్షికమైన, పారదర్శకమైన దర్యాప్తు చేపట్టాలని పిలుపునిచ్చింది.
బ్రిటన్‌ : బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితుల మృతులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అన్నారు. శాంతియుత నిరసనల హక్కుని రక్షించాలని, హింసకు తావివ్వకూడదని అన్నారు. అరెస్టయిన ఆందోళనకారులను విడుదల చేయాలని అధికారులకు సూచించారు. విచారణ కోసం తగిన ప్రక్రియను అనుసరించాలని ఓ ప్రకటనలో తెలిపారు. గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై ఐరాస నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ పేర్కొన్నారు.
జర్మనీ : దేశంలో నెలకొన్న అశాంతి దృష్ట్యా బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించడం ముఖ్యమని ఫెడరల్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
యూరోపియన్‌ యూనియన్‌ : బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పాలనకు ”క్రమబద్ధమైన మరియు శాంతియుతమైన” మార్పు రావాలని పిలుపునిచ్చింది.
కెనడా : బంగ్లాదేశ్‌లో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనను ఖండిస్తున్నట్లు కెనడా విదేశాంగ శాఖ పేర్కొంది. ఆందోళనకారులపై సైన్యాన్ని ప్రయోగించడం, నిర్భంధ అరెస్టులు, మరణాలు, చిత్రహింసలను ఖండిస్తున్నామని తెలిపింది.
వైట్‌ మ్యాన్‌ ఆఫర్‌ ! ఒప్పుకోకపోవడం వల్లే హసీనాకు ఈ కష్టాలా?
తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు జరుగుతున్నాయని, తన తండ్రి షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ తరహాలోనే తాను కూడా హత్యకు గురి కావచ్చని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా కొద్ది మాసాలు ముందు వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ల నుంచి కొత్త క్రిస్టియన్‌ దేశాన్ని రూపొందించేందుకు ‘వైట్‌ మ్యాన్‌’ కుట్ర పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. జనవరి మాసంలో తాను సులభంగా తిరిగి ఎన్నికవడానికి అవసరమైన సాయం చేస్తామని తనకు ఒక ఆఫర్‌ వచ్చిందని చెప్పారు. ఆ ఎన్నికల్లో హసీనా చాలా సులభంగానే విజయం సాధించారు. తన ప్రధాన ప్రత్యర్ధి ఖలీదా జియా పార్టీ ఎన్నికలను బహిష్కరించడంతో ఎన్నిక అంతా ఏకపక్షంగా సాగింది. బంగ్లాదేశ్‌లో వైమానిక స్థావరాన్ని నిర్మించుకునేందుకు విదేశీ ప్రభుత్వాన్ని అనుమతించాలన్నది వారి షరతుగా వుందని, దాన్ని తాను అనుమతించకపోవడం వల్లనే ఈనాడు తన ప్రభుత్వం సమస్యల్లో పడుతోందని చెప్పారు.
”బంగ్లాదేశ్‌లో ఎయిర్‌బేస్‌ను నిర్మించుకోవడానికి ఒక దేశాన్ని తాను అనుమతించినట్లైతే అప్పుడు నాకు ఎలాంటి సమస్యలు వుండేవి కావు.” అని ఆమె మే మాసంలోనే వ్యాఖ్యానించారు. ఆ ఆఫర్‌ కూడా ‘వైట్‌ మ్యాన్‌’ నుండే వచ్చిందన్నారు. ప్రత్యేకంగా ఏ దేశమన్న పేరును మాత్రం ఆమె వెల్లడించలేదు. ఇంకా సమస్యలు మరిన్ని చుట్టుముడతాయని ఆమె ఆనాడే హెచ్చరించారు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌లోని కొన్ని ప్రాంతాలు తీసుకుని తూర్పు తైమూర్‌ మాదిరిగా, వారు క్రిస్టియన్‌ దేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే అలాంటి ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని ఆమె ఆనాడే స్పష్టం చేశారు.

Spread the love