కార్పొరేట్ల కోసమే మార్కెట్ల రద్దు

Abolition of markets for corporates– వారికి కాసుల పంట…రైతులకు మరణశాసనం
– మరో రైతాంగ ఉద్యమానికి సన్నద్ధం : తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూపొందించిన జాతీయ మార్కెట్ల ముసాయిదా చట్టం రైతులకు మరణ శాసననమేని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్‌ చెప్పారు. కార్పొరేట్లకు కాసుల వర్షం కురిపించేందుకే కేంద్రం మార్కెట్లను రద్దు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం…మరో రూపంలో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. ఢిల్లీ ఉద్యమ తరహాలో మరో రైతాంగ ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌. వినయకుమార్‌ అధ్యక్షతన ‘మద్దతు ధరలపై ప్రధాని మొండి వైఖరి ఎవరికి కోసం’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ బడా కార్పొరేట్లకు ఆటంకంగా ఉన్న చట్టాలను మార్చి వారి ప్రయోజనాలను రక్షించబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కొనుగోలు, అమ్మాకాల్లో రైతుల ప్రమేయం లేకుండా చేస్తున్నదన్నారు. ఈ ప్రమాదం నుంచి రైతులను రక్షించేందుకు రైతు నేత జగ్జీత్‌సింగ్‌ దలేవాలా నిరవధిక దీక్ష చేస్తున్నారని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదన్నారు. గతంలో రైతుసంఘాలకు మోడీ, అమిత్‌షా ఇచ్చిన రాత పూర్వక హామీలను కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. స్వామినాథన్‌ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలను రూపొందించడంతోపాటు దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీని వల్ల ఏ మార్కెట్‌కు రైతు వెళ్లినా ఆ ధర ప్రకారం కొనాల్సిందేనన్నారు. ఆ చట్టం లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారం రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా రైతులు పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదని చెప్పారు. రైతులు అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో కౌలు రైతులు అత్యధికంగా ఉన్నారని తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్రం…కార్పొరేట్‌ కంపెనీలకు మాత్రం రూ.18వేల కోట్ల రుణాన్ని మాఫీ చేసిందని గుర్తు చేశారు. దేశ జనాభాలో 52 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కేరళ తరహాలో రుణవిమోచన చట్టాన్ని తీసుకరావాలని డిమాండ్‌ చేశారు. ప్రధాని మంత్రి ఫసల్‌ బీమా యోచన కూడా రైతుల కంటే కార్పొరేట్లకు ఎక్కువగా ఉపయోగపడుతున్నదని చెప్పారు. దీంతో ఫలితం లేదనుకున్న గుజరాత్‌ రాష్ట్రంతోసహా ఎనిమిది రాష్ట్రాలు ఫసల్‌ బీమా నుంచి బయటకు వచ్చాయని గుర్తు చేశారు. విద్యుత్‌ మోటార్లకు స్మార్టు బిగించి రైతులపై భారం మోపేందుకు కేంద్రం విద్యుత్‌ సవరణ బిల్లును తెచ్చిందని విమర్శించారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love