ఎల్‌టీసీజీపై పన్ను రద్దు చేయం

Abolition of tax on LTCG– మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడి
న్యూఢిల్లీ : దీర్ఘకాలిక పెట్టుబడి లాభాల (ఎల్‌టీసీజీ)పై పన్నులను రద్దు చేసే ప్రతిపాదనేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి స్పష్టం చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఎల్‌టీసీజీపై రూ.98,681 కోట్ల ఆదాయం సమకూరిందని మంత్రి మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ఈక్విటీ ఓరియెంటెడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై పన్ను విధానాన్ని 2018 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. రూ.లక్ష వరకూ ఆదాయంపై పన్ను రాయితీ, మిగతా పెట్టుబడులపై 10 శాతం ఎల్‌టీసీజీ పన్ను విధిస్తుంది. 2021-22లో రూ.86,075 కోట్ల ఎల్‌టీసీజీ పన్ను వసూలైందని మంత్రి తెలిపారు. 2022-23లో 15శాతం పెరిగి రూ.98,681 కోట్లుగా చోటుచేసుకుంది. 2018-19లో రూ.29,220 కోట్లు, 2019-20లో రూ.26,008 కోట్లు, 2020-21లో రూ.38,589 కోట్ల చొప్పున ఎల్‌టీసీజీ పన్నులు వసూళ్లయ్యాయని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఈక్విటీలు లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఎల్‌టీసీజీ పన్ను విధానాన్ని ఎప్పటి నుంచి రద్దు చేస్తారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇచ్చారు. అటువంటి ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని స్పష్టం చేశారు. ఈక్విటీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఎల్‌టీసీజీ పన్నును 10 నుంచి 12.5 శాతం వరకు పెంచుతూ మోడీ సర్కార్‌ తాజా బడ్జెట్‌లో నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షల వరకూ ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపు పరిమితి పెంచింది. 12 నెలలకు పైగా గడువుతో మదుపు చేసిన పెట్టుబడులను దీర్ఘకాలిక పెట్టుబడులుగా పరిగణిస్తారు. షార్ట్‌ టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్స్‌ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 20 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్‌ కంపెనీ షేర్లను ఏడాది లోపు విక్రయిస్తే వాటిని షార్ట్‌ టర్మ్‌గా, ఏడాది పైబడి షేర్లను విక్రయించకుండా ఉంటే లాంగ్‌టర్మ్‌ పెట్టుబడులుగా పరిగణిస్తారు.

Spread the love