గర్భస్రావ చట్టం చాలా ఉదారమైనది

Abortion law is very liberal– సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్య
న్యూఢిల్లీ : భారతదేశంలోని గర్భస్రావ చట్టం చాలా ఉదారమైనదని, ఇతర దేశాల కన్నా చాలా ముందున్నదని, మనకు అనుకూలమైన విధానం ఎంపిక చేసుకోవచ్చని, భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తన 26వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకోవాలని కోరుకుంటున్న ఒక మహిళ పిటిషన్‌ను విచారిస్తూ చంద్రచూడ్‌ శుక్రవారం పై వ్యాఖ్యలు చేశారు. ”మన గర్భస్రావ చట్టం ఇతర దేశాల చట్టాల కంటే చాలా ముందుంది అందులో ఎలాంటి సందేహం లేదు. రో వర్సెస్‌ వాడె పరిస్థితి మనకు ఇక్కడ లేదు. మన చట్టం చాలా ఉదారమైనది, మనకు అనుకూలమైన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు.” అని చంద్రచూడ్‌ పేర్కొన్నారు. గర్భస్రావ హక్కును దేశ రాజ్యాంగం పరిరక్షిస్తుందని అమెరికా సుప్రీం కోర్టు 1973లో రో వర్సెస్‌ వాడె కేసులో పేర్కొంది. గర్భం కొనసాగిస్తే తల్లి ప్రాణానికి ముప్పు వుందని లేదా గర్భస్థ శిశువులో అసాధారణమైన వైద్య సమస్యలు, లోపాలు వున్నాయని డాక్టర్ల బోర్డు అంగీకరించిన పక్షంలో 24వారాలు దాటిన తర్వాత కూడా గర్భస్రావం చేయడానికి మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగెన్సీ యాక్ట్‌ నిబంధనలు అనుమతిస్తున్నాయని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి చేసిన వాదనలను ప్రస్తావిస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మహిళ వివాహిత అని, మూడవసారి ఆమె గర్భం ధరించిందని, ఒకవేళ ఆమె తన గర్భాన్ని కొనసాగించినట్లైతే లోపల వున్న శిశువు కూడా చక్కగానే వుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని భాటి ప్రస్తావించారు. పిటిషనరు తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌ గతేడాది రెండవ కాన్పు తర్వాత అక్టోబరు నుండి ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతోందని, అందుకోసం వాడిన మందులు గర్భాన్ని కొనసాగించేందుకు అనుకూలంగా లేవని పేర్కొంటున్నారు. దాంతో ఆ డాక్టర్‌ ప్రిస్కిప్షన్లను పరిశీలన నిమిత్తం ఎయిమ్స్‌ మెడికల్‌ బోర్డుకు నివేదించారు. తల్లి లోపల వున్న బిడ్డ ఇరువురూ ఇబ్బంది పడకుండా వుండేలా ప్రత్యామ్నాయ వైద్య విధానం ఏమైనా వుందేమో పరిశీలించాల్సిందిగా కోర్టు, మెడికల్‌ బోర్డును కోరింది. దీనిపై విచారణను 16వ తేదీకి వాయిదా వేసింది.

Spread the love