బీఆర్‌ఎస్‌ దశాబ్ది దగా

– రేపు అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్‌ దిష్టిబొమ్మల దహనం : టీపీసీసీ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పదేండ్లుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను దగా చేస్తూ వస్తున్నదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ విమర్శిం చారు. దీనికి నిరసనగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో ‘దశాబ్ది దగా’ పేరుతో కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈమేరకు సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన రాజకీయాల వ్యవహారాల కమిటీ (పీఏసీీ) సమావేశమైంది. తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు, పార్టీ పరిస్థితులపై చర్చించింది. అనంతరం మహేష్‌కుమార్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్‌… ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నదని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలన్నీ దశాబ్ది దగా కార్యక్రమలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్‌ దిష్టిబొమ్మను రావణ సురుడిలాగా తయారు చేయాలి. పది తలలు ఏర్పాటు చేసి వాటికి ప్రభుత్వ వైఫల్యాలను రాయాలి. భారీ ప్రదర్శన నిర్వహించాలి. ఆ తర్వాత దహనం చేయాలి. అనంతరం ఆర్‌డీవోకుగానీ, ఎమ్మార్వోకు గానీ వినతిపత్రం సమర్పించాలి’ అని సూచించారు. ఆయా పథకాల బాధిత ప్రజలు ఆ నిరసన ప్రదర్శనల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లోని నాయకులంతా ఈ కార్యక్రమం జయప్రదానికి కషి చేయాలని సూచించారు.
ప్రభుత్వ వైఫల్యాలివే…
కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య ,ఫీజ్‌ రీయింబర్స్‌ మెంట్‌
ఇంటికో ఉద్యోగం నిరుద్యోగ భృతి ,పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు
దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి,పోడు భూములకు పట్టాలు
,రైతు రుణ మాఫీ ,12 శాతం ముస్లిం రిజర్వేషన్లు,12 శాతం గిరిజన రిజర్వేషన్లు

Spread the love