ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే, డాక్టర్ చెయ్యి పట్టుకుని నాడీ కొట్టుకునే వేగాన్ని చెక్ చేస్తారు. దీన్ని పల్స్ రేట్ అంటారు. దీని ఆధారంగా వ్యక్తి ఆరోగ్యంపై వైద్యులు ఓ అంచనాకు వస్తారు. సాధారణంగా హార్ట్ రేటు నిమిషానికి 55 నుంచి 85 బీట్స్ వరకు ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ లేదా తక్కువగా ఉంటే ఆరోగ్యం బాగాలేదని అర్థం. పల్స్ రేటు వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. పల్స్ రేటును ప్రభావితం చేసే అంశాలేంటి? ఈ రీడింగ్ ఎంత ఉంటే మంచిది? అసలు దీన్ని ఎలా కొలుస్తారు..? ఇలాంటి వివరాలు చూద్దాం.
ఒత్తిడి : తరచుగా ఒత్తిడి, ఆందోళన, ఎమోషన్స్‌కు గురవుతుంటే పల్స్‌పై ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో హదయ స్పందన రేటు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు.
బరువు : అధిక బరువు కూడా పల్స్ రేటును పెంచు తుంది. ఎందుకంటే అధిక బరువు కారణంగా వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేయడానికి శరీరం మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇది ఒత్తిడిని కలగజేసి పల్స్ రేటు పెరుగుదలకు కారణమవుతుంది.
రక్తహీనత : శరీరంలో రక్తం తగిన స్థాయిలో లేకపోతే పల్స్ రేటు పెరుగుతుంది. ముఖ్యంగా ఎర్ర రక్తకణాలు తక్కువ స్థాయిలో ఉంటే రక్తాన్ని సరఫరా చేయడానికి గుండె ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఫలితంగా పల్స్ రేటు పెరిగిపోతుంది.
నొప్పి : శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉంటే అది ఒత్తిడి కలగజేస్తుంది. దాని కారణంగా పల్స్ రేటు పెరుగుతుంది.
మందుల దుష్ప్రభావాలు : కొన్ని రకాల మందులు వాడటం వల్ల పల్స్ రేటులో మార్పు ఉంటుంది. ముఖ్యంగా బీటా బ్లాకర్స్ వంటి మందుల వినియోగంతో పల్స్ రేటు తగ్గిపోతుంది.
హార్మోన్స్ అసమతుల్యత : శరీరంలో వివిధ రకాల హార్మోన్స్ అసాధారణంగా ఉంటే పల్స్ రేటపై ప్రభావం పడుతుంది.
ఎలా మెజర్ చేస్తారు?
నాడిని అంచనా వేయడానికి చూపుడు, మధ్య వేలును మెడ మీద ఉండే శ్వాసనాళంపై ఉంచాలి. మణికట్టు మీద బొటనవేలు ఉంచి పల్స్ తెలుసుకోవచ్చు. నాడీ కొట్టుకోవడం మీకు స్పర్శగా వినిపిస్తున్నప్పుడు 15 సెకన్లలో బీట్స్ సంఖ్యను లెక్కించాలి. నిమిషానికి బీట్‌లను లెక్కించడానికి ఈ సంఖ్యను నాలుగుతో గుణించాలి.
పల్స్ రేటు బాగా తగ్గితే?
హదయ స్పందన రేటు చాలా నెమ్మదిగా ఉన్నప్పుడు, పల్స్ కూడా ఆటోమెటిక్‌గా తగ్గుతుంది. ఈ పరిస్థితిని వైద్య పరిభాషలో ‘బ్రాడీకార్డియా’ అని పిలుస్తారు. ఈ సమయంలో హదయ స్పందన రేటు 60 bజూఎ కంటే తక్కువగా ఉంటుంది. మందులు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, అంతర్లీనంగా ఆరోగ్య సమస్యలు, గుండె పనితీరులో సమస్యల వల్ల ఇలా జరగవచ్చు. బ్రాడీకార్డియా పరిస్థితికి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. అయితే దీర్ఘకాలం కొనసాగితే పరిస్థితి తీవ్రంగా మారుతుంది. ఇది మైకం, మూర్ఛ వంటి సమస్యలకు దారితీయవచ్చు.