కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో ఎసి కోచ్‌లు దగ్ధం

కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో ఎసి కోచ్‌లు దగ్ధం– విశాఖ స్టేషన్‌లో ఘటన
– షార్ట్‌ సర్క్యూట్‌ కారణం : అధికారులు
విశాఖపట్నం : విశాఖ రైల్వే స్టేషన్‌లో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. కోర్బా – విశాఖపట్నం (18517) కోర్బా ఎక్స్‌ప్రెస్‌ ఉదయం 6.20 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని 4వ నెంబర్‌ ఫ్లాట్‌ ఫామ్‌నకు చేరుకుంది. ప్రయాణికులు అందరూ దిగి వెళ్లిపోయారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైనే ఉంది. ఉదయం 9:30 గంటలకు రైలులోని బి8 ఎసి కోచ్‌లో మంటలు ప్రారంభమై బి6, బి7, ఎం1 కోచ్‌లకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బి7 కోచ్‌ పూర్తిగా దగ్ధం కాగా.. బి8, బి6, ఎం1 కోచ్‌లు 70 శాతం కాలిపోయాయి. స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో ప్రమాదం సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. సకాలంలో స్పందించిన విశాఖపట్నం సిటీ పోలీసులు, జిఆర్‌పి, ఆర్‌పిఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సంఘటన స్థలానికి విశాఖపట్నం సిటీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఫకీరప్ప, డిఆర్‌ఎం సౌరవ్‌ప్రసాద్‌ చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి ఎసి యూనిట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణమని ప్రాథమిక విచారణలో అధికారులు తెలిపారు. రైల్వే పోలీసులు (జిఆర్‌పి) కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రమాదం కారణంగా ఇతర రైళ్ల సేవలపై ప్రభావితం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కాలిపోయిన కోచ్‌ల స్థానంలో ప్రత్యామ్నాయ కోచ్‌లను ఏర్పాటు చేశారు. విశాఖపట్నం – కడప (17488) ఎక్స్‌ప్రెస్‌ నిర్ణీత సమయానికే విశాఖపట్నం నుంచి బయలుదేరింది.

Spread the love