– రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు
– అధికారులు, సిబ్బంది, ఏజెంట్లను విచారిస్తున్న ఏసీబీ
– దస్తావేజులు, నగదు స్వాధీనం
– ఫిర్యాదుల నేపథ్యంలోనే సోదాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో/మొఫసిల్ యంత్రాంగం
రవాణాశాఖలో అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో దాడులు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు పదేండ్ల కాలంలో ఇప్పటివరకు ఈ స్థాయిలో ఏసీబీ దాడులు జరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 22చోట్ల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. పలుచోట్ల దస్తావేజులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ అధికారులు, సిబ్బంది, ఏజెంట్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రవాణా శాఖలో పైసలు ఇవ్వకుండా పనులు జరగడం లేదని పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ దాడులు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లోని మొత్తం 11 కార్యాలయాలకుగాను.. మలక్‌పేట్, బండ్లగూడ, మెహిదీపట్నం, అత్తాపూర్, కూకట్‌పల్లి ఆఫీసుల్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఈ దాడుల సందర్భంగా పలు ఆర్టీఏ ఆఫీసుల్లో ఏజెంట్ల చేతుల్లో పలు ఫైల్స్ ఉండటాన్ని అధికారులు చూశారు.
ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైల్స్ మాత్రమే క్షణాల్లో పూర్తి..
ఆర్టీఏ ఆఫీసుల్లో ప్రతిరోజూ వివిధ రకాల సేవల కోసం వచ్చే ప్రజలు, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడం కోసం రవాణాశాఖ ఆన్‌లైన్ సేవలకు శ్రీకారం చుట్టింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో మొత్తం 11 ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. ఆయా ఆఫీసుల్లో లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సరిఫికెట్ల జారీతో పాటు మొత్తం 59 సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సేవల కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. వీటిలో సగానిపైగా సేవలు ఇంటి నుంచే చేసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే కొన్ని సేవలకు మాత్రం ఆర్టీఏ కార్యాలయాలకు రావాల్సి వస్తోంది. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్‌తో పాటు మరో పది రకాల సేవలకు మాత్రం ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందే. ఇందుకోసం నేరుగా స్లాట్ బుక్ చేసుకొని.. తమకు కేటాయించిన తేదీల్లో సేవలు పొందొచ్చు. వాస్తవానికి ఆన్‌లైన్ సేవల పట్ల చాలామంది వాహనాదారుల్లో అవగాహన లేకపోవడంతో ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు డైరెక్ట్‌గా వచ్చే దరఖాస్తులను అధికారులు పక్కన పెడతారని, ఏజెంట్ల ద్వారా వచ్చే ఫైల్స్ క్షణాల్లో పూర్తి చేస్తారనేది ప్రధాన ఆరోపణ. దీంతో చాలామంది వాహనదారులు ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించి పనులు చక్కబెట్టుకుంటారు. అందుకు వారికి కొంతమొత్తంలో డబ్బులు చెల్లిస్తుంటారు.
వందల్లో ఫీజులు..వేలల్లో చెల్లింపులు..!
ప్రభుత్వానికి రాష్ట్రంలో నాలుగో అతిపెద్ద ఆదాయ వనరు రవాణాశాఖ. ఆర్టీఏ కేంద్రాల ద్వారా ప్రతిరోజూ వేల సంఖ్యలో వాహనదారులు వివిధ రకాల సేవలు పొందటం ద్వారా ఆ శాఖకు రోజుకు కోట్లల్లో ఆదాయం వస్తోంది. అలాగే గ్రేటర్‌లో రోజూ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌లు సుమారు 1500కుపైగా అవుతాయి. అదే స్థాయిలో డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా జారీ అవుతుంటాయి. దీనికితోడు రవాణా శాఖ అందజేసే సేవల ఫీజులు కూడా చాలా వరకు రూ.500-1000లోపే ఉన్నాయి. కానీ వందల్లో చెల్లించాల్సిన ఫీజులకు బదులు వేల రూపాయిలు వెచ్చించాల్సి వస్తోందని వాహనదారుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి.
ఏజెంట్లు, నకిలీ పత్రాలపైనే ఏసీబీ దృష్టి..!
ఏసీబీ దాడుల్లో ప్రధానంగా ఏజెంట్లు, నకిలీ పత్రాలపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. అధికారులు, ఏజెంట్లు మధ్య సత్ససంబంధాలు, నకిలీ ఇన్సూరెన్స్‌లు, ఫేక్ అడ్రస్‌లతో ఆధార్ కార్డులు, గ్యాస్ బిల్లులు సృష్టించి వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లెసెన్సులు, ఇతర సేవలకు సంబంధించి జరుగుతున్న పనులతో పాటు ప్రతి పనికీ ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపైనే ఏసీబీ అధికారుల దాడులు జరిగాయని సమాచారం.
నల్లగొండ డీటీవో కార్యాలయంలో.. ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న అధికారులు
నల్లగొండ జిల్లా రవాణా శాఖ (డీటీఓ) కార్యాలయంలోనూ ఏసీబీ తనిఖీలు జరిగాయి. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆకస్మికంగా ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందర్, ఇన్‌స్పెక్టర్ల్లు రామారావు, వెంకటేశ్వరరావు, మరో 9 మంది సిబ్బందితో ఆకస్మిక దాడులు చేశారు. ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్, ఆర్సి, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన 60 దస్తావేజులను, రూ.12,500 స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీవో కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని, అనధికార ఏజెంట్ల ద్వారా అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులందినట్టు డీఎస్పీ మీడియాతో తెలిపారు. ఏసీబీ డీజీ ఆదేశానుసారం ఆకస్మిక తనిఖీ చేస్తున్నామన్నారు. ఏజెంట్లు కార్యాలయం లోపలికి రావడానికి లేదని, కానీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఏజెంట్లు లోపలికి వచ్చినట్టు తెలుస్తోందన్నారు. ఎంవిఐ, ఏఎంవీఐలు, ఇతర సిబ్బంది విధులకు సక్రమంగా హాజరు కాకపోవడాన్ని గుర్తించామన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది చేయాల్సిన పనులు చేయకుండా లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1064 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరజ్ ఇంటిగ్రెటెడ్ చెకోపోస్టులో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ కరీంనగర్ రేంజ్ ఇన్స్‌పెక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇందులో లెక్కకు రాని రూ.11630ను గుర్తించారు. ఎంవీఐ యశ్వంత్‌కుమార్, ఏఎంవీఐ అపర్ణను దాదాపు రెండు గంటల పాటు విచారించారు.
కరీంనగర్‌లో..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఉన్న జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మధ్యాహ్నం 12.30గంటలకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సీఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. వాహనదారులు, సేవాదారుల నుంచి స్లాట్ బుకింగ్ పత్రాలు, ఇతర పత్రాలను తీసుకుని పరిశీలించారు. ఏసీబీ డీజీ ఉత్తర్వుల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్టు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మీడియాకు తెలిపారు. కార్యాలయంలో అవకతవకలు గుర్తించినట్టు తెలిపారు. సేవల కోసం వచ్చే వాహనదారుల నుంచి తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని, వాహనదారుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నట్టు చెప్పారు. వినియోగదారుల నుంచి ఏజెంట్లు అధిక నగదు తీసుకుని ‘సీ’ ‘డీ’ లాంటి కోడింగ్‌లతో స్లాట్ పత్రాలపై రాసినట్టు గుర్తించినట్టు చెప్పారు.
మానుకోట ఆర్టీఏలో..
మహబూబాబాద్ జిల్లా ఆర్టీఏ కార్యాలయంలో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ డైరెక్టర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. వరంగల్ నుంచి వచ్చిన ఆరుగురు ఏసీబీ అధికారులు కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సోదాలు తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఆరుగురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని.. వారి నుంచి రూ.45వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డిటిఓ గౌస్ పాషా వ్యక్తిగత వాహన డ్రైవర్ సుబ్బారావు వద్ద రూ.16,500తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్‌లకు సంబంధించిన దరఖాస్తులు, కొన్ని కాగితాలను స్వాధీనం చేసుకున్నారు.