ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ తనిఖీలు

ACB inspections at Ashram Schoolనవతెలంగాణ-వేమనపల్లి
మండల కేంద్రంలోని ప్రభుతత్వ ఉన్నత ఆశ్రమ పాఠశాలలో మంగళవారం ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో పాఠశాలలోని రికార్డులు, బిల్లులు, స్టాక్‌, శానిటేషన్‌ విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల హాజరు, వంట సామాగ్రి తదితర అంశాలపై వివరాలు సేకరించారు. వసతి గృహంలో ఎంత మంది విద్యార్థులు ఉంటున్నారు..? రికార్డుల్లో ఎంత మంది వివరాలు ఉన్నాయి..? ఆహార నాణ్యత, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. రికార్డులు పరిశీలిస్తూ విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రికార్థులను క్షుణ్ణంగా పరిశీలించారు. టీచర్ల పని తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్లపై రైడ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. తనిఖీలో ఫుడ్‌ సేఫ్టీ, శానిటేషన్‌, తూనీకల కొలతల, ఆడిట్‌ శాఖల అధికారులు పాల్గొన్నట్టు తెలిపారు. ఫుడ్‌ మెనూ, వంట సరుకులు, భోజనం క్వాలిటీని ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పరిశీలించారు. శానిటేషన్‌ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉందని అన్నారు. మరుగుదొడ్లు విద్యార్థుల వాడుకునే స్థితిలో లేవని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు హాజరు శాతానికి వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై పూర్తి నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు కృష్ణకుమార్‌, కరుణాకర్‌, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love