శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసుపై ఎసిబీ ముమ్మర దర్యాప్తు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల వ్యవహారంపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) లోతుగా దర్యాప్తు చేస్తోంది. కస్టడీ విచారణ సమయంలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పేరును శివబాలకృష్ణ చెప్పడంతో.. అతణ్నీ విచారించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యాయ సలహాతో నోటీసులు జారీ చేసి విచారించడానికి సిద్ధమవుతోంది.ఐఏఎస్‌ అధికారి ఆదేశాల మేరకు అనుమతులు జారీ చేసి రూ.కోట్లను శివబాలకృష్ణ గడించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని విచారణలో అంగీకరించినట్లు తెలుస్తోంది. పలు స్థిరాస్తి సంస్థలకు అనుమతులు మంజూరు చేసినందుకు లభించిన సొమ్ములో ఆయన వాటాను తానే స్వయంగా తీసుకెళ్లి అప్పగించినట్లు నేరాంగీకార వాంగ్మూలంలో బహిర్గతం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే వారి మధ్య వాట్సప్‌ సంభాషణలు జరిగాయని, అక్రమార్జనను ఆస్తులుగా మార్చుకునేందుకు బినామీలతోనూ సంభాషించినట్లు చెబుతున్నారు.భూములు కొని రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో బినామీలు అక్కడే ఉన్నట్లు నిరూపించాల్సిన అవసరం ఏసీబీ ముందుంది. అలాగే ఐఏఎస్‌ అధికారికి వాటాల సొమ్మును శివబాలకృష్ణ స్వయంగా ముట్టజెప్పిన సమయంలోనూ ఇద్దరూ ఒకే చోట ఉన్నట్లు తేల్చాల్సి ఉంది. సెల్‌ఫోన్ల డేటాను వడపోసే పనిలో అధికారులు నిమగమయ్యారు. ఈ మేరకు కేసును ప్రాసిక్యూషన్‌ చేసేందుకు ప్రభుత్వ అనుమతులను అధికారులు తీసుకోనున్నారు. స్వాధీనం చేసుకున్న చరవాణులు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషిస్తున్న అధికారులు.. 161 నోటీసులు ఇచ్చి వివరాలు సేకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Spread the love