– సరద్దు ఆర్టీఏ చెక్ పోస్ట్ లో ఏసీబీ సోదాలు..
– నిబంధనలకు విరుద్ధంగా లభ్యమైన రూ.35 వేలు..
– వివరాలు వెల్లడించిన డీఎస్పీ రమేష్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నెల తిరక్కుండానే రెండో సారి అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పది రోజులు క్రితమే ఎన్పీడీసీఎల్ లో ఆపరేషన్ విభాగంలో అశ్వారావుపేట ఏఈఈ శరత్ అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కిన విషయం మరువక ముందే మరో అవినీతి ప్రభుత్వ శాఖపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా చెక్ పోస్ట్ పై దాడి చేసిన ఏసీబీ బృందం రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకుని ఏడుగురు ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.విధుల్లో ఉన్న ఎం.వీ.ఐ పై కేసు నమోదు చేశారు.ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక అంతర్ రాష్ట్ర సరిహద్దు రవాణా శాఖ చెక్ పోస్ట్ అధికారులు అవినీతి పై కొందరు లారీ డ్రైవర్లు,పలువురు లారీ ల యజమానుల పిర్యాదు మేరకు మంగళవారం ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఏసీబీ డీఎస్సీ వై.రమేష్ అధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడి చేసింది. అప్పటికే వాహనదారుల నుండి వసూలు చేసిన రూ.7 వేలు నగదును స్వాదీనం చేసుకున్నారు. వాహనదారుల నుండి వసూలు చేసి మరో రూ. 20 వేల నగదును ప్రయివేట్ సిబ్బంది నుండి స్వాదీనం చేసుకుని సోదాలు నిర్వహించారు. ఈ సమయంలోనే ఇతర వాహనదారులు ఆర్టీఏ చెక్ పోస్ట్ అధికారులు నిర్దేశించిన చెల్లింపు నగదు (సాధారణంగా ముట్ట చెప్పిన) రూ.8 వేల వరకు కూడా స్వాదీనం చేసుకున్నారు.యూనిఫాంలో ఉండాల్సిన ఎం.వీ.ఐ జనార్ధన్ రెడ్డి సాదారణ దుస్తుల్లో(మఫ్టీలో )ఉండటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
అనంతరం వాహనదారుల వివరాలు సేకరించారు. ఏ వాహనం ఎక్కడ నుండి ఎక్కడకు వెళుతుంది.ఏ ప్రాతిపదికన ముడుపులు ఎంత చెల్లిస్తున్నారు?అనే అంశాలను లిఖిత పూర్వకంగా తీసుకున్నారు.అనంతరం డీఎస్పీ వై.రమేష్ విలేకరులతో మాట్లాడుతూ సరిహద్దు రవాణా చెక్ పోస్ట్ ల పై కొంతకాలంగా లారీ డ్రైవర్లు, యజమానుల నుండి పిర్యాదులు అందుతున్నాయని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఒక పక్కా ప్రణాళికతో దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ పాసింగ్ పేరు తో వాహనదారుల నుండి లారీ టైర్లు ను బట్టి ఒక్కో ధర నిర్దేశించుకుని వసూళ్ళకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఒక్కో వాహనం నుండి రూ.200 నుండి రూ.800 వరకు అక్రమ వసూళ్ళు చేస్తున్నారని చెప్పారు. వాహనదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఏడుగురు ప్రయివేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుండి రూ.20 వేలు నగదు స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలో ప్రయివేట్ వ్యక్తులు ఎందుకు ఉన్నారు… ? వారికి వేతనాలు ఎవరు, ఎంత చెల్లిస్తున్నారో విచారించి తదుపరి చర్యలు నిమిత్తం రవాణా శాఖ ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తామని,దీనితో పాటు ఏంటి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పారు. విధుల్లో ఉన్న ఎం.వీ.ఐ జనార్ధన్ రెడ్డితో సహా ఏడుగురు ప్రయివేట్ వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.ఆయన వెంట ఏసీబీ సీఐ లు సునీల్,శేఖర్, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య,రంగ సిబ్బంది ఉన్నారు.