మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి, రెవిన్యూ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

– ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణ నేపథ్యంలో తనిఖీలు
నవతెలంగాణ – కంటేశ్వర
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇన్చార్జి రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయం నుంచి నిజామాబాద్ ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్, ఇన్చార్జి రెవెన్యూ అధికారి నరేందర్ నివాసంలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని వినాయక నగర్ లో గల అశోక టవర్ లోని నరేందర్ ఇంటిలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారన్న ఫిర్యాదు మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడు చిరు ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ హోదా వరకు పనిచేసిన నరేందర్ పై ఏసీబీ అధికారులు దృష్టి సారించడం బల్దియాలో కలకలం రేపింది. మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా మారినప్పటికీ నిజామాబాద్ కేంద్రంగానే విధులు నిర్వహిస్తున్న నరేందర్ పై పలు ఆరోపణలు వివాదాలు ఉన్నాయి. గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో యోగితా రాణా జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో రెవిన్యూ బిల్ కలెక్టర్ పనిచేసిన నరేందర్ ఒక వృద్ధురాలికి సంబంధించిన పెన్షన్ డబ్బులను కాజేసినందుకు సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నరేందర్ కు బోధన్ మున్సిపాలిటీకి బదిలీ చేసిన రాజకీయ అండతో ఇక్కడి నుంచి బదిలీ కాలేదని సమాచారం. ఏసీబీ అధికారులు సోదాల అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Spread the love