– పాలకుల్లా కాకుండా సేవకులుగా వ్యవహరిస్తాం
– పాలన ఎలా ఉండకూడదనడానికి జగన్ ఒక కేస్ స్టడీ
– మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు
అమరావతి : ‘ప్రజలు అపూర్వమైన తీర్చు నిచ్చారు. దీనిని బాధ్యతగా స్వీకరిస్తా’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తరువాత మొదటి సారిగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి చరిత్రాత్మక ఎన్నికలను ఎప్పుడూ చూడలేదన్నారు. అటువంటి తీర్పు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పాలకులుగా కాకుండా తాము సేవకులుగా వ్యవహరిస్తామని చెప్పారు. జగన్ పాలనలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ప్రస్తావించిన ఆయన కొంత ఉద్విగతకు లోనయ్యారు. శాసనసభలో తన కుటుంబానికి అవమానం జరిగిందని చెప్పారు. ‘బాంబుల దాడిని కూడా తట్టుకుని నిలబడ్డా. కానీ, ఆ అవమానాన్ని భరించలేకపోయాను’ అని ఆయన గద్గద స్వరంతో చెప్పారు. పాలన ఎలా ఉండకూడదో చెప్పడానికి జగన్ ఒక కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. ‘జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో ప్రతి ఒక్కరూ దెబ్బతిన్నారు. ఐదేళ్లుగా స్వేచ్ఛ, స్వతంత్రాలను కోల్పోయారు. అరాచకాన్ని చవిచూశారు. బతకడంపై ఆశను కోల్పోయారు.’అని చంద్రబాబు అన్నారు. ‘ఇటువంటి పాలనను నా అనుభవంలో చూడలేదు. అందుకే ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలవాలి అని పిలుపునిచ్చా. ప్రజలు అనూ హ్యంగా మద్దతు ఇచ్చారు. వైసిపి ఐదేళ్ల పాలనలో 30 ఏళ్ల నష్టం జరిగింది’ అని అన్నారు. ‘రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదు. దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలే శాశ్వతం. పంథా లేని పార్టీలు ఎన్నో కనుమరుగయ్యాయి.’ అని చంద్రబాబు చెప్పారు.
కార్యకర్తల త్యాగాల వల్లే
కార్యకర్తలు చేసిన అసమాన త్యాగాలే తెలుగుదేశం పార్టీని గెలుపు బాట పట్టించాయని చెప్పారు. ‘ప్రాణాలు తీస్తున్నా జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య వంటి వారు త్యాగాలు చేశారు. దానివల్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం.’ అని అన్నారు. జగన్ అందర్నీ ఇబ్బందులకు గురిచేశారని మీడియా నూ కూడా వదల లేదని చెప్పారు. మీడియా ప్రతినిధులను కోర్టుల చుట్టూ, సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పారని అన్నారు. పవన్‌ను కూడా విశాఖ నగర బహిష్కరణ చేశారని, కేసులు ఎందుకు పెట్టారో కూడా చెప్పకుండా ఆరెస్టు చేయించారని అన్నారు. పవన్ కల్యాణ్ ముందుకొచ్చి కూటమికి బీజం వేసినందుకు అభినందిస్తున్నానని తెలిపారు. ఇసుక, మైనింగ్, పొలాలనూ తవ్వేశారని ప్రాణభయంతో రైతులు కూడా మాట్లాడలేని పరిస్థితిని సృష్టించారని అన్నారు.
ప్రజలు సహకరించారు
అసెంబ్లీలో తన కుటుంబాన్ని అవమానపరిచినప్పుడు మళ్లీ సిఎంగా గెలిచే సభలోకి వస్తానని ప్రతిన చేసి బయటకు వచ్చానని, ఆ ప్రతినను నెరవేర్చేందుకు ప్రజలు ఎంతగానో సహకరించారని చెప్పారు. శాసనసభను మళ్లీ గౌరవ సభగా మారుస్తానన్నారు. ఓట్లు వేయడమే కాకుండా పాలనలో కూడా ప్రజల నుండి సహకారం కావాలని, ప్రభుత్వ పనితీరుపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని కోరారు.