– లీకేజీపై సమగ్ర విచారణ
– గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడి
– ఇంకా కొనసాగుతున్న ఇద్దరు సభ్యులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎఎస్సీ) చైర్మెన్ డాక్టర్ బి జనార్ధన్‌రెడ్డి, ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కారం రవీందర్‌రెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్టకేలకు బుధవారం ఆమోదించారు. వారి రాజీనామాల ఆమోదానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో అడ్వకేట్ జనరల్‌తో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ నలుగురి రాజీనామాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ పదవికి జనార్ధన్‌రెడ్డి డిసెంబర్ 11న రాజీనామా చేశారు. రెండు రోజుల తర్వాత అంటే అదేనెల 13న ముగ్గురు సభ్యులు రాజీనామాలను గవర్నర్‌కు సమర్పించారు. అయితే గత చైర్మెన్, బోర్డు హయాంలో జరిగిన ప్రశ్నాపత్రం లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించామని గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్‌లో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. నిరుద్యోగులు, ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. రాజ్యాంగం, న్యాయ సూత్రాలు, పారదర్శకత, అంకితభావంతో గవర్నర్ వ్యవహరించారని తెలిపారు. రాజీనామా ఒక్కరోజులో తీసుకునే నిర్ణయం కాదనీ, న్యాయ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే టీఎస్‌పీఎస్సీ సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు. వారు ఇంకా కొనసాగుతూనే ఉండడం గమనార్హం. వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందో చూడాల్సిందే.
కొత్త కమిషన్‌పై సర్కారు కసరత్తు
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల రాజీనామాల ఆమోదంతో త్వరలో కొత్త కమిషన్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఆశావహులైన పలువురు ఐఏఎస్, మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్లు, ప్రముఖులు ప్రభుత్వానికి తమ బయోడేటాను ఇచ్చినట్టు తెలిసింది. యూపీఎస్సీ సహా కేరళలో అనుసరిస్తున్న విధానాలపై ఇప్పటికే అధికారుల బృందం అధ్యయనం చేసింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించే అవకాశమున్నది. యూపీఎస్సీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సందర్శించి పలు అంశాలను పరిశీలించారు. అయితే సుప్రీం ఆదేశాలకనుగుణంగా టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల నియామకాల ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఈ దిశగా కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. కొత్త పాలకమండలి ఏర్పాటైన తర్వాతే గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 రాతపరీక్షలకు తేదీలను ఖరారు చేసేందుకు అవకాశముంటుంది. గ్రూప్-4 రాతపరీక్షలు ముగిశాయి. వాటి ఫలితాలను వెల్లడించాల్సి ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి, అందుకనుగుణంగా నియామకాల ప్రక్రియను చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భావిస్తున్నారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అవసరమైన విధంగా నిష్పక్షపాతంగా, వివాదరహితంగా నిరుద్యోగులకు మేలు చేసే అధికారులను టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యులుగా నియమించే అవకాశమున్నది. ప్రశ్నాపత్రాల లీకేజీతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ హయాంలో అలాంటి వాటికి తావివ్వకుండా పారదర్శకంగా నియామకాల ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశమున్నది.
జనార్ధన్‌రెడ్డిపై విమర్శ వెల్లువ
బీఆర్‌ఎస్ హయాంలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీఎస్‌పీఎస్సీపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చైర్మెన్ జనార్ధన్‌రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని పలు రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు ఆరోపించారు. టీఎస్‌పీఎస్సీని ముట్టడించి బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేయాలని జనార్ధన్‌రెడ్డి అప్పుడే నిర్ణయించుకున్నారు. అయితే ఆయన నిర్ణయాన్ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలనీ, సంస్కరణలు చేపట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించింది. దీంతో ఆయన తన నిర్ణయాన్ని విరమించుకున్నారు. రెండోసారి నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో కమిషన్‌పై నిరుద్యోగుల్లో మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ హామీలు ఇచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో డిసెంబర్ 11న జనార్ధన్‌రెడ్డి తన చైర్మెన్ పదవికి రాజీనామా చేశారు. ఎట్టకేలకు గవర్నర్ ఆ రాజీనామాను ఆమోదించారు.