నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలోని ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వాహనంలో కోటప్పకొండకు వెళ్తుండగా… ఘాట్ రోడ్డులో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 13 మందితో పాటు వంట సామగ్రి, బ్యాగులు చెల్లా చెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి వైద్యం అందడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్షతగాత్రులు, బాధితుల నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తీసుకున్నారు.