నవతెలంగాణ – హైదరాబాద్: ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో జరిగిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. నాగమణిని చంపిన ఆమె తమ్ముడు పరమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై బీఎన్‌ఎస్ 103 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కులదురహంకరతో పాటు ఆస్తి వివాదం కోణంలో విచారణ చేస్తున్నారు. పరమేశ్‌కు సహకరించిన నిందితుల కోసం మూడు బృందాలతో ఇబ్రహీంపట్నం పోలీసులు గాలిస్తున్నారు.
కుల దురహంకార హత్యకు పాల్పడిన నిందితుడు కొంగర పరమేశును ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించారు. నిందితుడు పరమేష్ తన సోదరి హత్యకు గల కారణాలను పోలీసులు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ నాగమణి ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురైన ఆమె సోదరుడు పరమేష్ కు ఇద్దరు అక్కలున్నారు. పెద్ద అక్క హైమావతి కాగా చిన్న అక్క నాగమణి. హైమావతికి 2009లో వివాహం జరిగింది. ఆమె తన భర్తతో తుర్కయంజల్‌లో నివసిస్తోంది. మృతురాలు నాగమణి ఆమె సోదరుడు పరమేష్ తల్లిదండ్రులు గత 10 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుండి నాగమణి తన సోదరుడు పరమేష్ రాయపోల్ గ్రామంలో వారి మేనమామ వద్ద ఉంటున్నారు. 2014లో కొంగర నాగమణి వివాహం ఎంపీ పటేల్ గూడకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. నాగమణి మొదటి వివాహం సందర్భంగా పసుపు, కుంకుమల కింద ఎక్కరా భూమిని బహుమతిగా ఇచ్చారు. కానీ ఆమె భర్తతో వివాదాల కారణంగా నాగమణి ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చి తన సోదరుడితో కలిసి తన మేన మామతో నివసిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పోటీ పరీక్షల కోసం హయత్ నగర్ లోని హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వస్తోంది. 2020లో నాగమణి పోలీస్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించింది. కుషాయిగూడ, హయత్ నగర్ పోలీసు స్టేషన్లలో పనిచేసింది. ఆ తర్వాత ఆమె మొదటి భర్త నుండి విడాకులకు దాఖలు చేసి 2022లో డిగ్రీని పొందింది. నాగమణి రాయపోల్‌లో ఉన్న సమయంలో ఎస్సీ (మాల) వర్గానికి చెందిన అదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడింది. అతనితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు కొంగర పరమేష్ ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హెచ్చరించారు. తమ కులస్తుని వివాహం చేసుకోవాలని బలవంతం చేశారు. కానీ నాగమణి వారి మాట వినలేదు. ఆమె వ్యక్తిగత జీవితంలో ఆమె కుటుంబ సభ్యుల జోక్యం చేసుకోవద్దని ఆమె మొదటి వివాహం సమయంలో ఆమెకు ఇచ్చిన ఎకరం భూమిని తిరిగి తన సోదరుడైన కొంగర పరమేశకు రిజిస్ట్రేషన్ చేసింది. తర్వాత ఈ సంవత్సరం నవంబర్ 10వ తేదీన యాదగిరిగుట్ట టెంపుల్ వద్ద నాగమణి తను ప్రేమించిన బండారి శ్రీకాంత్ ను కులాంతర వివాహం చేసుకుంది. అప్పటినుండి భార్యాభర్తలు ఇద్దరు వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్స్‌లో అద్దె ఇంట్లో ఉన్నారు. ఈ తరుణంలో నాగమణి తన 1 ఎకరం భూమిని తిరిగి ఇవ్వాలని ఆమె సోదరుడైన పరమేష్ పై ఒత్తిడి పెంచింది. దాంతో సోదరి కులాంతర వివాహం చేసుకోవడమే కాకుండా తిరిగి భూమిని అడుగుతునడంతో ఆమెపై తన సోదరుడు శత్రుత్వాన్ని మరింత పెంచుకున్నాడు. సమాజంలో మరింత ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని మనస్థాపానికి గురైన నిందితుడు పరమేష్ తన అక్క నాగమణిని అంతమొందించడానికి ఒక పథకం వేశాడు. ఏ క్షణానైనా హత్య చేసేందుకు మారనాయుదాలను సిద్ధంగా ఉంచుకున్నాడు. ఆదివారం నాగమణి తన భర్తతో కలిసి రాయపోల్ గ్రామాన్ని వచ్చింది. ఆమె రాక గురించి తెలుసుకున్న నిందితుడు పరమేష్ విసుగు చెంది, తన ముందస్తు పథకం ప్రకారం ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో అతను తన స్నేహితుడు ఏ2 అచ్చనా శివను సంప్రదించి నాగమణి కదలికలను తెలుసుకున్నాడు. అతని సహాయం తీసుకున్నాడు. నాగమణి రాయపోల్ నుంచి పోలీసు విధుల కోసం సోమవారం ఉదయం సుమారు 8:30 గంటలకు ఆమె స్కూటీపై ఇంటి నుండి బయలుదేరింది. పోల్కంపల్లి రోడ్డు మీదుగా వెళ్తుండగా చూసిన అర్చన శివ వెంటనే కొంగర పరమేశ్ కు సమాచారం ఇచ్చాడు. దాంతో కొంగర పరమేష్ తన సోదరీమైనా నాగమణిని వెంబడించి కారుతో వెనుకాల అనుసరించారు. సుమారు ఉదయం తొమ్మిది గంటల సమయంలో రాయపోల్ గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలోకి మాన్యగూడ గ్రామం వైపు నాగమణి చేరుకున్న సందర్భంగా ప్రజల కదలికలు లేవని గమనించిన పరమేష్ ఒక్కసారిగా నాగమణి స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టాడు. దాంతో నాగమణి ఒక్కసారిగా కింద పడిపోయింది. అప్పటికే తన కారులో సిద్ధంగా ఉంచుకున్న కత్తితో ఆమె మెడపై నరికి హత్య చేశాడు. దాంతో నాగమణి అక్కడికక్కడే మృత్యువాత పడింది. కానిస్టేబుల్ నాగమణి హత్య ఉదాంతం దావానంల వ్యాపించడంతో సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం సిఐ సత్యనారాయణ తన పోలీస్ బృందంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోల్కంపల్లి గ్రామం పరిధిలోని జనార్ష వెంచర్లో నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని మంగళవారం రిమాండ్కు తరలించారు. నాగమణి హత్యకు ఉపయోగించిన మారణాయుధాలతోపాటు కారును స్వాధీనం చేసుకున్నారు.