వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసు..నిందితులకు రిమాండ్

నవతెలంగాణ-హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద దాడి కేసులో నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. జిల్లాలోని లగచర్లలో నిన్న కలెక్టర్‌పై కొంతమంది రైతులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఫార్మా సిటీకి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్‌పై దాడి జరిగింది. ఈ కేసులో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు వారిని కొడంగల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. అనంతరం జడ్జి వారికి రిమాండ్ విధించారు. నిన్న మొత్తం 55 మంది రైతులను పరిగి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత 39 మంది రైతులను విడుదల చేశారు. 16 మందిని మరింత లోతుగా విచారించి వైద్య పరీక్షలకు పంపించారు. ఇదిలా ఉండగా, ఈ దాడి ఘటనను తెలంగాణ పోలీస్ విభాగం తీవ్రంగా పరిగణిస్తోంది. అధికారులపై దాడి చేసిన వారితో పాటు గ్రామస్థులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ది బీఆర్ఎస్ పార్టీగా గుర్తించారు. మణికొండలో ఉండే అతను పక్కా ప్రణాళికతో లగచర్లకు వచ్చి… గ్రామస్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Spread the love