పలు చోట్ల చోరీలు..పట్టుబడిన నిందితులు

– రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు
– వయస్సు31..23 ద్విచక్ర వాహనాలు చోరీ
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
మెట్రోస్టేషన్ల వద్ద పార్కింగ్‌ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న రాయుడు చైతన్య సాయికుమార్‌(31) అనే వ్యక్తిని ఉప్పల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం నిందితుడి వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌ బాబు మీడియాకు వెల్లడించారు. సికింద్రాబాద్‌ సీతాఫల్‌ మండిలో నివాసం ఉంటున్న రాయుడు చైతన్య సాయి కుమార్‌ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం. చెడు అలవాట్లకు బానిసై మెట్రో వద్ద పార్కింగ్‌ చేసిన వాహనాలను దొంగలించి, నెంబర్‌ ప్లేట్‌ లను మార్చి, నకిలీ రిజిస్ట్రేషన్‌ల సాయంతో ఓఎల్‌ఎక్స్‌ లో అమ్మకానికి పెట్టేవాడు. శనివారం నాగోల్‌లోని ఎస్‌వీఎం గ్రాండ్‌ వద్ద ఉప్పల్‌ పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. తొమ్మిది పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 23 బైక్‌ల చోరీల్లో 19 కేసుల్లో హస్తం ఉన్నట్లు తేలింది. నిందితుని వద్ద నుండి 23 ద్విచక్ర వాహనాలు, ప్రింటర్‌, ల్యాప్‌ టాప్‌, ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ నిందితుడిపై వివిధ క్రైమ్‌ కేసులు ఉన్నాయి. పోలీసులు దొంగలను పట్టుకోవడం కోసం ఎంత టెక్నాలజీ వాడుతున్నామో..అంతే స్థాయిలో నిందితులు కూడా టెక్నాలజీ వాడుతున్నారు. ఉప్పల్‌ స్టేషన్‌లో 7 కేసులు. గోపాలపురం, ఎస్‌ఆర్‌ నగర్‌, కొత్తగూడెం, విజయవాడ, మియాపూర్‌ లలో కేసులు నమోదయ్యాయి. గతంలో పలు కేసుల్లో జైల్‌కు వెళ్లి వచ్చిన దొంగ బుద్ధి మార్చుకోలేదు. కమిషనర్‌ వెంట మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ చంద్ర శేఖర్‌, ఉప్పల్‌ ఇంచార్జి ఇన్‌స్పెక్టర్‌ మన్మధకుమార్‌, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.
ఇండ్లలో దొంగతనాలు చేస్తున్న యువకుడు అరెస్ట్‌…
జల్సాలకు అలవాటు పడి, తాళాలు వేసి ఉన్న ఇండ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని కుషాయిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో నిందితుడి వివరాలను రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. కుషాయిగూడలోని మార్కెట్‌ వెనుక నివాసం ఉంటున్న కొంతం సాయి కిరణ్‌ రెడ్డి అలియాస్‌ చింటూ. ఇతని స్వస్థలం నాచారం మల్లాపూర్‌. మధ్యాహ్నం నాచారం, కీసర, మేడిపల్లి, మల్కాజిగిరి, కుషాయిగూడలలో 2021లో కేసుల్లో అరెస్ట్‌ అయి జైలుకు వెళ్లాడన్నారు. 2023 జులై లో విడుదల అయ్యాక చర్లపల్లిలోని ఓ కంపెనీ లో పనిచేసేవాడు. నిందితున్ని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి 30తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనం, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మొత్తం వాటి విలువ రూ.18,50,000 ఉటుందని చెప్పారు. ఆయన వెంట మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ఏసీపీ చంద్ర శేఖర్‌, కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ సాయి ప్రకాష్‌ గౌడ్‌ తదితరులు ఉన్నారు.
ట్రాక్టర్‌ ట్రాలీలు దొంగతనం చేసే ఇద్దరు అరెస్ట్‌…
రైతులు పొలాల వద్ద ఉంచిన ట్రాక్టర్‌ ట్రాలీ లను దొంగలించిన ఇద్దరిని మాడ్గుల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీనగర్‌లోని సీపీ క్యాంప్‌ కార్యాలయంలో శనివారం రాచకొండ సీపీ సుధీర్‌ బాబు నిందితుల వివరాలు మీడియాకు వెల్లడించారు. నల్గొండ జిల్లా లోహాలియా మండలంలోని మారేపల్లి గ్రామానికి చెందిన సంపంగి మహేష్‌.. నల్గొండ జిల్లా కనగల్‌ మండలం, చర్ల గౌరారం గ్రామానికి చెందిన ఓర్సు వెంకన్నలు కూలి పని చేసేవారని తెలిపారు. వారి కుటుంబాలకు సరిపడా డబ్బులు రాకపోవడంతో ట్రాక్టర్‌ ట్రాలీలను ఇంజన్‌ సహాయంతో దొంగలించేవారన్నారు. మాడ్గులకు చెందిన బాధితుడి ఫిర్యాదు మేరకు కేస్‌ నమోదు చేసుకుని, నిందితుల వద్ద నుండి 13 ట్రాక్టర్ల ట్రాలీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మొత్తం వాటి విలువ 20లక్షల రూపాయలు ఉంటుందన్నారు. మొత్తం వారిపై 12కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.ఈ సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ శ్రీనివాసరావు, మాడ్గుల ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love