అక్రమ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలి

అక్రమ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలి– మా భూములు మాకిప్పించండి
– ఆర్డీఓ కార్యాలయం ఎదుట పోతారం గ్రామస్తుల నిరాహార దీక్ష
నవతెలంగాణ-హుస్నాబాద్‌ రూరల్‌
తమ భూములను అక్రమంగా పట్టా చేయించుకున్న వారిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పోతారం (ఎస్‌) గ్రామస్తులు హుస్నాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ రూరల్‌ మండల పరిధిలోని పోతారం గ్రామ శివారులో తమకు చెందిన భూములను కొంతమంది భూ ఆక్రమణదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు. ఈ విషయమై ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేయగా.. అధికారులు భూములను సర్వే చేసి పంచనామా నిర్వహించారని చెప్పారు. తమకు న్యాయం చేస్తామన్నారని, కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయమూ చేయలేదన్నారు. దాంతో ఆక్రమణదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని యథేచ్ఛగా మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ భూములపై ఆధారపడిన 10 నుంచి 12 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నేర్పడిందన్నారు. తమకు న్యాయం చేసే వరకు దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Spread the love