– ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి
నవ తెలంగాణ – సిద్దిపేట
స్థానికంగా లేని వార్డెన్ల పైన చర్యలు తీసుకోవాలనీ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఎస్ఎఫ్ఐ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా స్థానికంగా లేని హాస్టల్ వార్డెన్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వార్డెన్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వార్డెన్ లు హాస్టళ్లలో ఉండకుండా బయట కాలక్షేపాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి వార్డెన్ల వల్ల హాస్టల్ వ్యవస్థ దెబ్బ తింటుందన్నారు. వార్డెన్లు హాస్టల్లో ఉండకుండా బయట బిజినెస్ లు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాళ్ళ వల్ల అనేక సమస్యలతో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వార్డెన్లను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రెడ్డమైన అరవింద్, దాసరి ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు ఆముదాల రంజిత్ రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శిలు నాచారం శేఖర్, చెప్యాల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.