– పాఠాలు చెప్పవలసిన ప్రిన్సిపల్ విద్యార్థులతో అసభ్యకర ప్రవర్తన..
– నారాయణ విద్యా సంస్థల యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్ లో పాఠాలు చెప్పాల్సిన ప్రిన్సిపాల్ నిత్యం విద్యార్థులను బూతులు తిడుతుంటాడని పి.డి.ఎస్.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్ పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహాద్రి లు అన్నారు. మంగళవారం ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తూ పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరితో విద్యార్థులు ప్రతిరోజూ ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. విద్యార్థులను చైతన్యవంతం చేయడంలో ముందుండాలి గాని తన నోటికి వచ్చినట్టు ప్రిన్సిపాల్ బూతులు, దుర్భాషలాడటం తగదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.అందుకు విద్యా శాఖ ఉన్నతాధికారులు పాఠశాల యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ముందు బైఠాయించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి తల్లిదండ్రులకు,నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ సంఘటన పై జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే స్పందించి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, విద్యార్థుల తల్లిదండ్రులు,తదితరులు పాల్గొన్నారు.