– ప్రధాన రహదారిపై రైతుల ధర్నా
నవతెలంగాణ-కోదాడరూరల్
కల్తీ విత్తనాల వల్ల పంట దిగుబడి రావడం లేదని, వాటిని అమ్మే దుకాణాలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సూర్యాపేట – కోదాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కూచిపూడితండా, మేళ్లచెర్వు మండలం యతిరాజు పురంతండా, చిలుకూరు మండలానికి చెందిన శీత్లాతండా, దూదియాతండాకు చెందిన తాము ఖరీఫ్ సీజన్‌లో చింట్లు, కావేరి కంపెనీకి సంబంధిం చిన వరి విత్తనాలను పట్టణంలోని చంద్రకళ ఫర్టిలైజర్ దుకాణంలో కొనుగోలు చేశామన్నారు. పంట సాగు చేసిన తర్వాత పైరు కొంతమేరకే ఈ నిందని(గింజ పోయడం) తెలిపారు. దీంతో తాము మోసపోయామని తెలుసుకుని సదరు దుకాణ యజమానిని ప్రశ్నించగా త్వరలో సమస్యను పరిష్క రిస్తామని హామీ ఇవ్వడంతో ఇన్ని రోజులు ఎదురు చూశామని చెప్పారు. ఎకరాకు రూ.20 వేల మేర నష్టపోయామన్నారు. శనివారం దుకాణం వద్దకు వచ్చి పంట నష్టపరిహారం చెల్లించాలని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళన చేయాల్సి వచ్చిందని తెలిపారు. వరి కంకులు పట్టుకుని న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని దుకాణదారుడి తో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు.