ఎక్సైజ్ మంత్రికి వినతిపత్రం అందిస్తాం
గౌడ సంఘం మండలాధ్యక్షుడు నాయబ్ గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని మొగిలి గుండ్ల గ్రామం లో ఈత వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం మండలాధ్యక్షుడు నాయబ్ గౌడ్ డిమాండ్ చేశారు. మొగిలి గుండ్ల గ్రామం 52 సర్వే నం బర్‌లో రెండున్నర ఎకరాల్లోని ఈత వనాన్ని రాత్రికి రాత్రి ధ్వంసం చేసి భూమిలో పాతి పెట్టారని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఈతవనం మండలంలోని మొగలిగుండ్లలోనే ఉందన్నారు. ఇక్కడి నుండి ఈత కల్లు జిల్లావ్యాప్తంగా సరఫరా అయ్యేది అన్నారు. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేలాది ఈత వనాన్ని ధ్వంసం చేసి భూములు సాగు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుణ్యమా అని మండలంలో ఈతవనాలు కను మరుగు అవుతున్నాయని అన్నారు. రోజురోజుకూ ఈత చెట్లు తగ్గిపోవడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని తెలిపారు. ఓవైపు ప్రభుత్వం ఈత వనాలు పెంచాలని ప్రోత్సహిస్తుంటే వందేండ్ల నుంచి ఉన్న ఈత చెట్లను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో జేసీబీలతో ధ్వంసం చేయడం ఎంత వరకు న్యాయమన్నారు. ఎక్సైజ్ అధికా రులు చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టకపోవడంతోనే అక్రమార్కులు ఈత వనాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. రోజురోజుకూ ఈత వనాలు కనుమరుగు కావడంతో గీత కార్మి కుల బతుకు తెరువు భారం అవుతుందని ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గి పోతుంతన్నారు. ఈత వనాన్ని ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మండ లంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టి ఎక్సైజ్ మంత్రిని కలిసి వినతి పత్రం అందిస్తా మన్నారు.