– రాష్ట్ర ప్రభుత్వానికి సీపీఐ(ఎం) సూచన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ ఉప వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సూచించింది. ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పులో ఎస్సీ కేటగిరీలో మరింత వెనుకబడిన కులాలకు విడివిడిగా కోటాలు ఇచ్చుకోవడానికి అనుమతించడం సానుకూల అంశమని తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ తీర్పును అమలుపరచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ తీర్పులో స్పష్టంగా పేర్కొన్నదని వివరించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన అన్ని రకాల చర్యలూ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. ఎస్సీల్లోని వెనుకబడిన కులాలను విధాన నిర్ణ యాల పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేయాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల్లో కూడా అత్యంత వెనుకబడిన కులాలు (ఎంబీసీ) కడు పేదరికం అనుభవిస్తున్నాయని తెలిపారు. రిజర్వేషన్ల ఫలితాలు అన్ని తరగతులకూ దక్కాలంటే బీసీల్లో వర్గీకరణ చేపట్టాలని కోరారు. ఈ వర్గీకరణను స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లకు వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.